చివరి అస్త్రం: తెలంగాణకు రాయలసీమ కొర్రీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన చేస్తే తమకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు వస్తాయంటూ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పడం ద్వారా తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చారని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనపై అధికారికంగా ప్రకటన చేయడానికి ఎక్కువ రోజులు కూడా తీసుకోక పోవచ్చుననే మాట వినిపిస్తోంది.
రాయల తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో ముమ్మరంగా వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి కాంగ్రెసు రాయలసీమ ప్రాంత నాయకులే పెద్ద యెత్తున ముందుకు వస్తున్నారు.

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి మాత్రం రాష్ట్ర విభజన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, జెడి శీలం వంటివారు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. కేంద్ర మంత్రి చిరంజీవి కూడా అదే మాట చెబుతున్నారు. చాలా మంది కోస్తాంధ్ర కాంగ్రెసు నాయకులు, రాష్ట్ర మంత్రులు కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
రాయలసీమ నేతలు మాత్రం విభజనను వ్యతిరేకించడానికే సిద్ధపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజించాల్సి వస్తే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అంటున్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఈ డిమాండ్‌తోనే మాజీ తెలుగుదేశం నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉద్యమం కూడా చేపట్టారు. రాయలసీమకు అన్యాయం చేస్తుంటే చూస్తూ కూర్చుంటున్నారని ఆయన తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను విమర్సిస్తున్నారు. వారిని ఆయన రాయలసీమ ద్రోహులుగా కూడా అభివర్ణిస్తున్నారు.
ఈ స్థితిలో రాయలసీమ నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి వంటి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమకు చెందిన మంత్రి రఘువీరా రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మరో రాయలసీమ మంత్రి శైలజానాథ్ మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన నేతలు రాయలసీమ నుంచి లేకపోవడం గమనార్హం.
మొత్తం మీద, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి యత్నంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ప్రయోగిస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకుందనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. నిజంగానే రాష్ట్రాన్ని విభజిస్తుందా అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది.












Click it and Unblock the Notifications