ఫ్రెండ్స్: బాబుకు దీదీ షాక్, విజయమ్మకి ఫోన్(పిక్చర్స్)
హైదరాబాద్: థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, కాంగ్రెసు, బిజెపియేతర ఏ ఫ్రంట్ అయినా సిద్ధమన్న సంకేతాలిచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు ఫోన్ చేశారు.
ఇటీవల జెడి(యు) ఎన్డీయే నుండి వైదొలిగిన అనంతరం మమత ఫెడరల్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకు వచ్చారు. ఈ ఫ్రంట్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. అయితే ఫెడరల్, థర్డ్ ఏదనేది ముందు ముందు తేలనుందన్నారు. తద్వారా ఫెడరల్ ఫ్రంట్‌కు బాబు జై కొట్టారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ విజయమ్మకు ఫోన్ చేశారు. జాతీయ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, ఇతర పార్టీలతో కలిసి నడిచే అవకాశాన్ని పరిశీలిద్దామని ప్రతిపాదించారు.
నవంబరులో ముందస్తు అవకాశాలు లేకపోలేదని ఆమె విజయమ్మతో చెప్పారు. తన ప్రతిపాదనను పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవాలని విజయమ్మను కోరారు. ఈ ప్రతిపాదనను జగన్ దృష్టి తీసుకువెళ్లేందుకు విజయమ్మ కూడా అంగీకరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ క్షేమ సమాచారాలు, ఆయన మీద ఉన్న కేసుల వివరాలను మమత అడిగి తెలుసుకున్నారని, వైయస్‌తో తనకున్న పరిచయాలను జ్ఞాపకం చేసుకున్నారని పేర్కొంది.
బాబు ప్రకటన చేసిన 24 గంటల్లో...
చంద్రబాబు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కేంద్రంలో తాము కింగ్ మేకర్లమవుతామని, రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. మమతా బెనర్జీతో టచ్‌లో ఉన్నామని, థర్డ్ ఫ్రంట్ పైన ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఆ ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటల్లో విజయమ్మకు మమత ఫోన్ చేయడం గమనార్హం.
లైన్లో కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా తమ పార్టీ సీనియర్ నేత కె కేశవ రావుకు మమతా బెనర్జీ టచ్‌లో ఉన్నారని చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన మూడు పార్టీలు మమతా బెనర్జీతో టచ్‌లో ఉండటం గమనార్హం. అయితే మమత కంటే బాబు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో వెళ్లే అవకాశాలు ఎక్కువుంటాయి. తెరాస పరిస్థితి అంతే అంటున్నారు. మమతా బెనర్జీతో కలిసి వెళ్లే అవకాశాలు ఎక్కువగా జగన్ పార్టీకే ఉన్నాయని చెబుతున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రచార కమిటీ సారథిగా ఎన్నికవడంతో ఆయనపై అసంతృప్తితో ఉన్న జెడి(యు) ఇటీవల ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పింది. అప్పుడే జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెసు పార్టీ జెడి(యు)ను మచ్చిక చేసుకోవాలని చూస్తోంది.

జెడి(యు) ఎన్డీఏకు గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించిన వెంటనే తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ అని ప్రకటన చేశారు.

మమత ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన చేయగానే అనూహ్య స్పందన వచ్చింది. నితీష్ కుమార్ ముందుకు వచ్చారు. ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. అదే సమయంలో థర్డ్ ఫ్రంట్ కలలు కంటున్న టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించారు.

అనూహ్యంగా మమతా బెనర్జీ టిడిపి అధినేతకు ఓ రకంగా ఝలక్ ఇచ్చినట్లుగానే చెప్పవచ్చు. చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు మమతా బెనర్జీ ఫోన్ చేసి, ఫెడరల్ ఫ్రంట్‌కు ఆహ్వానం పంపారు.

విజయమ్మకు మమతా బెనర్జీ ఫోన్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికలలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాలేని పరిస్థితి ఉంటే, జగన్ పార్టీ ఉన్న ఫెడరల్ ఫ్రంట్‌లోకి టిడిపి వెళ్లే అవకాశాలు లేవు. అయితే ఫెడరల్ కంటే థర్డ్ ఫ్రంట్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications