కూలిన విమానం: ఇద్దరు మృతి, భారతీయులు క్షేమం

విమానం ఆకాశం నుంచి భూమికి దిగుతుండగా దాని తోక నేలను తాకి ముక్కలైంది. విమానం మధ్యభాగం రన్‌వేను ఢీకొట్టి, ముందుకు జారిపోతూ రెండుసార్లు ఎగిరిపడింది. తర్వాత దాని పైభాగం అగ్నిజ్వాలల్లో కాలి బూడిదైంది. శనివారం అర్ధరాత్రి దాటాక ఇది జరిగింది. ఏషియానా ఎయిర్ లైన్స్ సంస్థ (దక్షిణకొరియా) నడిపే బోయింగ్ 777-200 విమానం (ఓజడ్-214) చైనాలోని షాంఘై నుంచి బయల్దేరింది.
దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఆగింది. అక్కడి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో చేరింది. విమానాశ్రయంలో దిగుతుండగా ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో చక్రాలు విచ్చుకోలేదు. హఠాత్తుగా భీకర శబ్దం...విమానం ఊగిపోయింది. ప్రయాణికుల కళ్లెదుటే దాని తోక విరిగి ముక్కచెక్కలైంది. మధ్యభాగం నేలను ఢీకొనడంతో పైకప్పు, లగేజి ప్రయాణికుల తలలపై పడింది. విమానం రన్‌వే నుంచి పచ్చికలోకి జారిపోతుండగా కొందరు దూకేశారు.
ఇంతలో రెండువైపులా జారుడు బెలూన్లు విచ్చుకోవడంతో అప్పటికే గాయపడి ఉన్న 182 మంది క్షేమంగా బయటపడగలిగారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. క్షతగాత్రులందరికీ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన ఆస్పత్రిలో తక్షణ చికిత్స చేశారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఈ సంఘటన ఫలితంగా విమానాశ్రయం నుంచి రాకపోకలను నిలిపేయడంతో వేలాది ప్రయాణికులు అగచాట్లు పడ్డారు.












Click it and Unblock the Notifications