కూలిన సిటీ లైట్ హోటల్ భవనం: హలీం బట్టీల వల్లనే

సిటీ లైట్ హోటల్ భవనాన్ని నిర్మించి దాదాపు 80 ఏళ్లు అయిందని సమాచారం. ఈ భవనంలో సిటీలైట్ హోటల్ 1979లో ప్రారంభమైంది. దాదాపు 35 ఏళ్లుగా చాయ్, లుక్మీ, హలీంలకు సిటీలైట్ పేరు గాంచింది. ఇదిలావుంటే, బుధవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. దీంతో హలీం తయారీ కోసం హోటల్ పైభాగంలో ప్రత్యేకంగా ఎనిమిది బట్టీలను నిర్మించారు. ఇందుకు పెద్దఎత్తున ఇటుకలను, ఇసుకను, మట్టిని తరలించారు. ఒక్కొక్క బట్టీ తయారీకి సుమారు 800 కిలోల సరుకులు అవసరమని అంచనా. ఎనిమిది బట్టీల బరువు దాదాపు 6.4 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
హలీం తయారీ మొదలుపెట్టడంతో బట్టీలనుంచి వెలువడే తీవ్రమైన వేడికి పైకప్పు బలహీనపడింది. పురాతన భవనంపై ఇంత బరువు వేయడం.. బట్టీ నుంచి వెలువడిన వేడిమి కారణంగా భవనం కుప్పకూలి ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి, భవనం పైభాగంలో బట్టీలను నిర్మించవద్దని వాటి నిర్మాణం సందర్భంగానే హోటల్లోని కొంతమంది సిబ్బంది యజమానిని వారించినట్లు చెబుతున్నారు. అయినా, పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుంచే పెచ్చులు ఊడుతున్నా కూడా యాజమాన్యం గమనించలేదు.
సిటీలైట్ భవనం శిథిల, పురాతన భవనాల జాబితాలో లేదని, దీనికితోడు భవనం బయటి భాగంలో, లోపల అందంగా తీర్చిదిద్దడంతో ఏ కోశానా అనుమానం కలగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు వ్యాఖ్యానించా రు. సిటీలైట్ భవనాన్ని చూసిన వారెవ్వరికీ అది కూలుతుందన్న సందేహం రాదని చెప్పారు.












Click it and Unblock the Notifications