బోనాలు: మహంకాళికి కిరణ్ సహా నేతల తాకిడి
హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
లక్షలాది మంది భక్తులు వచ్చేసే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు అమ్మవారి మేలుకొలుపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ మేలుకొలుపు ఉత్సవాలకు స్థానిక సనత్‌నగర్ శాసనసభ్యుడు, జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి సతీసమేతంగా హాజరై, పూజలు జరిపారు.

వీరితో పాటు ఆలయ ఫౌండర్ ట్రస్టీ సురిటి క్రిష్ణ కు టుంబం ఈ పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము 4గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఐపిల తాకిడితో దర్శనం ఆలస్యం అవుతుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బోనాల జాతరలో పాల్గొనే భక్తుల కోసం ఆరు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో బోనాలతో వచ్చే మహిళలకు ఇబ్బందులు కలుగకుండా వారు అమ్మవారిని త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు.
ఆషాడ జాతరగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రసిద్ధి గాంచింది. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర జరగనుంది. ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం కార్యక్రమంలో అవివాహిత మహిళ భవిష్యవాణి వినిపిస్తుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి. దీంతో సికింద్రాబాద్‌కు మొత్తం బోనాల కళ వచ్చింది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 30 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.












Click it and Unblock the Notifications