హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ హైదరాబాద్ పర్యటన: లైవ్ అప్‌డేట్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బిజెపి ప్రచార రథసారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నవభారత్ యువభేరీ సభ ద్వారా మోడీ దేశవ్యాప్తంగా తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్థితిలో ఆయన సభకు లభించే ఆదరణపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Narendra Modi

- కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- మోడీ నారాయణగుడాలోని కేశవ మెమోరియల్ స్కూల్‌కు చేరుకున్నారు. ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

- ప్రసంగం చివరలో మోడీ జై తెలంగాణ, జై సీమాంధ్ర నినాదం ఇచ్చి ప్రజలతో అనిపించారు.

- తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మోడీ తన ప్రసంగంలో ప్రశంసించారు. నైపుణ్యాలను పెంచడమెలాగో గుజరాత్‌ను చూసి నేర్చుకోవాలని, అది ఇష్టం లేకపోతే మీ పొరుగునే ఉన్న జయలలిత ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని మోడీ అన్నారు.

- ఎన్టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

- ఎన్టీఆర్ అభివృద్ధికి పాటుపడ్డారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ అందించే అత్యుత్తమ నివాళి కాంగ్రెసు నుంచి విముక్తి కలిగించి, దేశాన్ని అభివృద్ధి చేయడమేనని ఆయన అన్నారు. భారతదేశానికి ఎన్టీఆర్ చిరస్మరణీయమని ఆయన అన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి ఎన్టీఆరే కారణమని ఆయన అన్నారు. ఓట్లుపోతాయనే భయంతోనే కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమైందని ఆయన అన్నారు.

- "నేను గుజరాత్ గడ్డ మీది నుంచి వచ్చాను, మహాత్మా గాంధీ గడ్డ మీంచి వచ్చాను, సర్దార్ పటేల్ గడ్డ మీంచి వచ్చాను. తెలంగాణ ఎంత ముఖ్యమో, ఆంధ్ర కూడా అంతే ముఖ్యం. తల్లి పాల పంపకంలో వివక్ష ఉండకూడదు. గుజరాత్‌లో 6 లక్షల తెలుగువాళ్లు ఉన్నారు. ప్రేమతో బతుకున్నాం. కలిసిమెలిసి బతుకున్నాం. ప్రేమతో సహజీవనం చేస్తున్నాం. తెలంగాణవాళ్లు అంద్రవాళ్లతో ప్రేమతో జీవించగలుగుతారు, ఆంధ్రవాళ్లు తెలుగువాళ్లలతో అంతే ప్రేమతో జీవించ గలుగుతారు. ఆంధ్ర, తెలంగాణలను గుజరాత్ కన్నా ముందుకు తీసుకుని వెళ్తాం. ప్రగతిలోనే అన్నీ ఉన్నాయి. కాంగ్రెసు ప్రగతి పథంలో నడవడానికి సిద్ధంగా లేదు" అని మోడీ అన్నారు.

- కాంగ్రెసు విభజించు పాలించు పద్ధతిని అవలంబిస్తోంది. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతో పెద్ద యెత్తున ఎంపిలను గెలుచుకుంది. కేంద్రంలో కాంగ్రెసు అధికారంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ వల్లనే అని ఆయన అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇద్దరు సోదరుల మధ్య కాంగ్రెసు పార్టీ కయ్యం పెట్టిందని ఆయన విమర్శించారు. తెలంగాణకు మొదటి నుంచి బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పామని ఆయన అన్నారు. సీమాంధ్ర వికాసాన్ని భారతదేశానికి గౌరవప్రదంగా ఉండే విధంగా చూస్తామని చెప్పారు. హైదరాబాద్ కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాల రాజధానిగా పదేళ్లుగా ఉంచుతామని కాంగ్రెసు చెప్పడాన్ని ఆయన చెప్పారు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసే అధికారం కాంగ్రెసుకు లేదని ఆయన అన్నారు.

- గత 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని మోడీ అన్నారు. పాకిస్తాన్ ఐదుగురు భారత జవాన్లను హతమార్చిన సంఘటన అభద్రతా భావాన్ని పెంచిందని, ఇంత జరుగతుంటే ప్రభుత్వం ఎక్కడుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. జమ్మూలో మతఘర్షణలు అమానుషమని మోడీ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి చోరబాట్లను నివారించలేకపోతున్నారని ఆయన విమర్శించారు.

- చాలా మందికి ఈ స్టేడియంలో చోటు లభించలేదని, అయితే వారందరికీ తన హృదయంలో చోటుందని, తాను చూడలేకపోయిన వారందరినీ మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తానని ఆయన అన్నారు.

- 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్ర్యం వచ్చిందని, సెప్టెంబర్ 17వ తేదీ తన జన్మదినం కావడం విశేషమని ఆయన అన్నారు.

- సోదరీసోదరమణులారా, అంటూ తన తెలుగు సంబోధిస్తూ తెలుగులో నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, కొనసాగించారు.

- "భారతదేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశంసనీయమని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యంతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి మీరందరూ త్వరగా బయటకు రావాలని మనసారా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి సద్బుద్ధి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. తెలుగువారితో గుజరాత్ సంబంధాలు చాలా ప్రాచీనమైనవి. కాబట్టి గుజరాత్ లో తెలుగు మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను" అంటూ మోడీ తెలుగులో మాట్లాడారు. ఆ తర్వాత హిందీలో మాట్లాడడం ప్రారంభించారు.

- నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన మైకు వద్దకు రాగానే ప్రజలు హర్షాతిరేకాలు చేశారు.

- ఎన్నారై వ్యక్తికి చెందిన 84 ఏళ్ల మహిళ మోడీని చూడడానికి వచ్చింది. ఆమెను మోడీ సత్కరించారు. అలాగే, 86 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఇంద్రసేనా రెడ్డి పట్టుబట్టి మోడీ సభకు వచ్చారు. ఆయనను మోడీ సత్కరించారు.

- మోడీని వెంకయ్య నాయుడు 3డిగా అభివర్ణించారు. డైనమిజం, డిసిసివ్‌నెస్, డెవలప్‌మెంట్ ఆ 3డి అని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రజలను విభజిస్తోందని ఆయన విమర్శించారు. మజ్లీస్ కోరలు పీకే సత్తా బిజెపికి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

- సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను గుజరాత్ మాదిరిగా బిజెపి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు.

- నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ప్రసంగించనున్నారు.

- పార్క్ హయత్ హోటల్ నుంచి నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంలోని సభా స్థలికి బయలుదేరారు.

- తన విజయంలో ఆరు కోట్ల గుజరాతీయుల పాత్ర ఉందని నరేంద్ర మోడీ సినీ ప్రముఖులతో అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేయలేదని, తాను సెట్ చేసిన మౌలిక సదుపాయాలే గుజరాత్‌ను ముందుకు తీసుకుని వెళ్లాయని ఆయన అన్నారు. దేశాన్ని కూడా భవిష్యత్తులో ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

- నరేంద్ర మోడీ సభకు జనసందోహం పోటెత్తింది. స్టేడియం నిండిపోయింది. స్టేడియం వెలుపల పెద్ద యెత్తున అభిమానులున్నారు. వారు లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ గొడవలో ఓ గేట్ పాక్షికంగా దెబ్బ తింది. ఎటు వెళ్లాలో తెలియక బిజెపి కార్యకర్తలు, అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వియ్యంకుడు, నందమూరి హీరో బాలకృష్ణ నరేంద్ర మోడీని కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మురళీమోహన్ మోడీని కలిశారు.

- కేంద్ర మంత్రి చిరంజీవి బావమరిది, తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్, మరో సినీ నిర్మాత సురేష్ బాబు, నటులు ఎవియస్, సుమన్ తదితరులు కూడా మోడీని కలిసినవారిలో ఉన్నారు.

- పార్క్ హయత్ హోటల్‌లో నరేంద్ర మోడీని కలవడానికి సినీ ప్రముఖులు బారులు తీరారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మీప్రసన్న, నిర్మాత కళ్యాణ్, దర్శకుడు రాఘవేంద్ర రావు, సంగీత దర్శకుడు కీరవాణి, నటులు జగపతిబాబు తదితరులు కలిశారు. సినీ నటి గౌతమి కూడా మోడీని కలిశారు.

- నవభారత్ యువభేరీ జరిగే ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ ప్రసంగం సాయంత్రం 4 - 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

- బిసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు మోడీని కలిసిన బిసి సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు.

- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు నరేంద్ర మోడీని కలిసిన ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు.

- తెలుగు సినీ దర్శకులు వివి వినాయక్, పూరీ జగన్నాథ్ కూడా మోడీని కలిసినవారిలో ఉన్నారు.

- మోడీని కలిసేందుకు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సినీ ప్రముఖులు రామ్ గోపాల్ వర్మ, అలీ, కోట శ్రీనివాస రావు కలిశారు. ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా ఆయనను కలిశారు.

- సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా మోడీని కలవాల్సి ఉంది.

- నరేంద్ర మోడీ 81 మందికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వారితో ఆయనను వరుసగా కలుస్తున్నారు.

- పార్క్ హయత్ హోటల్‌లో నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలతో ప్రముఖులతో సమావేశమయ్యారు. ఎల్బీ స్టేడియంలో పెద్ద యెత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. సభా వేదిక సిద్ధమైంది.

- నరేంద్ర మోడీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బిజెపి ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

- బిజెపి టీవీ చానెల్ రాజ్ టీవీ ప్రసారాలను ప్రారంభించింది. నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు ప్రాముఖ్యం ఇస్తూ ప్రస్తుతం ప్రసారాలను సాగిస్తోంది. నరేంద్ర మోడీపై ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అది ఆదివారం ప్రసారం చేస్తోంది.

- ఎల్బీ స్టేడియంలో మోడీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 7 గంటల వరకు అమలులో ఉంటాయి.

English summary
BJP compaign committee chairman and Gujarath CM Narendra Modi has reached Hyerabad to address Nava Bharath Yuva bheri meeting at LB stadium in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X