సమ్మెతో లెక్క తేల్తుంది: హైద్రాబాద్‌లో ఉండొద్దని టిఎన్జీవో

రాష్ట్రంలో సివిల్ వార్ పరిస్థితులు నెలకొన్నాయంటూ తెలుగుదేశం పార్టీ సభ్యుడు సుజనా చౌదరి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల పైనా వారు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోలు చేస్తున్న ఆందోళనలపై తాము ఇంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, వారి ఉద్యమానికి తాము అడ్డు చెప్పబోమని అన్నారు. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయొద్దని హెచ్చరించారు.
సకల జనుల సమ్మె సమయంలో ఎస్మాలు, పోలీసు కేసులను ప్రయోగించిన ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమం సందర్భంగా ఏం చేస్తోందని నిలదీశారు. ఈ సమ్మెతో హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు ఎందరో తేలుతుందని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న డిమాండ్‌తో మంగళవారం నుంచి 17 వరకు కలెక్టరేట్లు, శాఖాధిపతులు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళనలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌ను పాలస్తీనాతోనూ, తెలంగాణ ఉద్యమాన్ని భారత్-పాక్ మధ్య యుద్ధంగా ఎపిఎన్జీవోలు అభివర్ణించారని, తెలంగాణ ఉద్యమ నేతలకు స్థాయి లేదంటూ మమ్మల్ని తిట్టారని, తాము మౌనంగా ఉన్నందుకే ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.అన్నదమ్ముల్లా ఉన్నామని, హైదరాబాద్ అందరిదన్నామని, అందుకే ఇలా మాట్లాడుతున్నారా? అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
హైదరాబాద్‌లో ఎంత మంది సమ్మెకు వెళతారో జాబితాలు తయారుచేయనున్నామని వెల్లడించారు. రాష్ట్ర విభజన నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కు వెళ్లిన పక్షంలో మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతంలో విగ్రహాల విధ్వంసంలో అక్కడి ఉద్యోగులు సైతం పాల్గొన్నట్లుగా తెలుస్తోందని, తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర నేతల విగ్రహాలను కూలగొట్టదలచుకుంటే గంట సమయం చాలని ఆయన మండిపడ్డారు. హైదరాబాదులో ఉండే సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం లేదన్నారు.
కానీ, విగ్రహాల విధ్వంసం తమ సంస్కృతి కాదని అన్నారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తామంటున్న సీమాంధ్ర ఉద్యోగులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎందుకు అడ్డుకోవట్లేదని నిలదీశారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేయ తలపెట్టిన సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని విఠల్, రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండనివ్వబోమని హెచ్చరించారు. అక్రమంగా నియమితులైన వారే ఎపిఎన్జీవోలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. వారి లెక్కలు తీసి కేంద్రానికి ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications