జలాంతర్గామికి అగ్ని ప్రమాదం: మృతుల్లో విశాఖవాసి
ముంబై: నావికాదళానికి చెందిన ముంబై రేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో రేవులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి దెబ్బ తిన్నది. ఈ ప్రమాదంలో 18 మంది సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నావికుడు రాజేష్ ఉన్నాడు. ఇతను విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వ్యక్తి. రాజేష్ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు విశాఖ నావికాదళం అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నావికాదళం సిబ్బంది మృతి చెందినట్లు రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ధ్రువీకరిచారు. అయితే, ఎంత మంది మరణించారనే విషయాన్ని ఆయన చెప్పలేదు.

మొత్తం 18 మంది గల్లంతు కాగా, వారిలో ముగ్గురు అధికారులు ఉన్నారు. అగ్ని ప్రమాదంలో జలాంతర్గామి తీవ్రంగా దెబ్బ తిన్నట్లు టీవి చానెల్ వార్తలను బట్టి అర్థమవుతోంది. సగం మేరకు జలాంతర్గామి మంటల్లో చిక్కుకుపోయింది. 16 ఫైర్ టెండర్ల సహకారంతో బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు.
నావికాదళం రేవులో సంభవించిన అగ్నిప్రమాదంపై నేవీ విచారణకు ఆదేశించింది. కొంత మంది అధికారులు జలాంతర్గామిలో చిక్కుకుని ఉన్నట్లు తెలిసిందని, ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ అంతకు ముందు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గాయపడినవారిని కోలాబాలోని ఐఎన్‌హెచ్ఎస్ నావికాదళం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications