తమిళనాడుకు సమైక్య ఉద్యమ సెగ, తిరుమల ఖాళీ

కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం, సిరుముగై, మూలత్తూరై, పగత్తూరు, ఆలంగొప్పు తదితర ప్రాంతాల్లో 5వేలకు పైగా చేనేత పరిశ్రమలున్నాయి. ఇక్కడ స్వచ్ఛమైన, కోరా రకానికి చెందిన పట్టును ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి పట్టు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పది లక్షల మంది, పరోక్షంగా 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
ఇక్కడ ఉత్పత్తయిన పట్టులో 60 శాతం ఎపికి, 40 శాతం మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తుంది. ఉద్యమం నేపథ్యంలో ఎపి నుంచి ఆర్డర్లు ఆగిపోయాయి. పట్టు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఆర్డర్లు లేకపోవడంతో ఉపాధికి గండిపడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల కొండపై ప్రభావం
సమైక్య రాష్ట్రం కోసం నిర్వహిస్తున్న బంద్ ప్రభావం తిరుమల శ్రీనివాసుడిపై పడింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో మంగళవారం తిరుమల కొండ ఖాళీ అయింది. శ్రీవారి ఆలయ పరిసరాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. అద్దె, సొంత వాహనాల్లో వచ్చే భక్తులతో సర్వదర్శన క్యూ కాంప్లెక్సు పది కంపార్టుమెంట్లు కూడా మించలేదు.
శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. తిరుమలకు మినహాయింపు ఇవ్వకపోవడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అప్పటికి తిరుమలలోనే నిలిచిపోయిన భక్తుల్లో కొందరిని మంగళవారం ఉదయం టిటిడి వాహనాల్లో తిరుపతికి ఉచితంగా తరలించారు. ఇంకొందరు ప్రయివేటు వాహనాల్లో వచ్చారు.
దూర ప్రాంతాల నుంచి రైళ్లల్లో వచ్చిన భక్తులతో పాటు స్థానికులు కూడా ప్రైవేటు వాహనాల్లో తిరుమలకు అధిక ధర చెల్లించి చేరుకున్నారు. రెండో వైకుంఠం క్యూకాంప్లెక్సులో కేవలం 10 కంపార్టుమెంట్లకు కూడా మించలేదు. వీరికి 4 గంటల్లో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లిన భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుని వస్తున్నారు.












Click it and Unblock the Notifications