చంద్రబాబుతో విభేదాలు: హరికృష్ణకి జూఎన్టీఆర్ కలిస్తే...!

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు తన మొదటి కూతురు బ్రాహ్మణిని ఇచ్చిన బాలకృష్ణ సహజంగానే తెలుగుదేశానికి, బాబుకు అండగా నిలబడుతున్నారు. హరికృష్ణ మాత్రం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ఆయన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఇందుకు ఆయన విభజన అంశాన్ని సాకుగా చూపుతున్నారని అంటున్నారు.
గతంలో అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి హరికృష్ణ ఫెయిల్ అయ్యారు. అయితే ఇప్పుడు తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అండతో పార్టీ పెట్టినా ఫలితముంటుందని ఆయన భావిస్తుండవచ్చునని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో నందమూరి కుటుంబంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 2009లో టిడిపి తరఫున ప్రచారం చేసినప్పుడు బాలయ్య, జూనియర్లకు బ్రహ్మరథం పట్టారు.
తాజాగా సమైక్యాంధ్ర కోసమంటూ రాజీనామా చేసిన హరికృష్ణ త్వరలో కొత్త పార్టీ పెట్టవచ్చుననే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో తెలుగుదేశం ఇరు ప్రాంతాల్లో సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హరి పార్టీ పెడితే సీమాంధ్రలో తమ పార్టీకి ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్లలో ఆందోళన వ్యక్తమవుతోందట.
అదే సమయంలో తాత స్థాపించిన టిడిపికి చనిపోయేంత వరకు అండగా ఉంటానని చెప్పిన జూనియర్ కూడా తండ్రి పార్టీ పెడితే ప్రచారం చేయకుండా ఉండలేరంటున్నారు. తాత ఆశయాల కోసమే తన తండ్రి కొత్త పార్టీని స్థాపించారని చెబుతూ... జూనియర్ హరికృష్ణకు మద్దతుగా నిలబడితే టిడిపికి మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు.












Click it and Unblock the Notifications