పిలుస్తా: కిరణ్, టి మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రాంత మంత్రుల మధ్య శనివారం ఆసక్తికరమైన చర్చ సాగిందట. సచివాలయంలో కిరణ్‌ను వారు కలుసుకున్నారు. ఇంతకాలం తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయని, ఇప్పుడు సీమాంధ్రలో అదే స్థాయిలో ఉద్యమం ఉందని, అన్ని సంఘాలూ, ప్రజలూ రోడ్లపైకి వచ్చి లక్షలాదిగా ఆందోళనలు చేస్తున్నారని కిరణ్ వారితో అన్నారు.
దానికి వారు.. లేదని, సీమాంధ్రలో జరుగుతున్నది కేవలం పది రోజుల ఉద్యమమేనని కానీ, ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణ ప్రాంతంలో ఏళ్లుగా సాగుతోందని, ఆ సమయంలో నియోజకవర్గాల్లో తిరగలేకపోయామని, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో అవమానాలకు గురయ్యామని, వాటన్నింటిని భరిస్తూనే, మంత్రులుగా బాధ్యతను నిర్వర్తించామని, ఏనాడూ ప్రభుత్వ విధులకు దూరంగా ఉండలేదని సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్‌తో సహా తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజల రక్షణ బాధ్యతను తమ భుజానికి ఎత్తుకున్నామని వారు కిరణ్ దృష్టికి తెచ్చారు. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ జాతీయ నేతల విగ్రహాలను అవమానిస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని తెలిపారు. తొలుత విగ్రహాల విధ్వంసం సాగినా, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిందని కిరణ్ వారితో అన్నారు. విగ్రహాల ధ్వంసం తెలంగాణ ఉద్యమంలోనూ జరిగిన విషయాన్ని మంత్రులకు గుర్తు చేశారట.
అయితే, ఇన్నేళ్ల ఉద్యమంలో ఆపాటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడం సహజమేనని, అది కూడా ఒక్కసారే జరిగిందని వివరించారట. అలాగే సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు, వివక్ష చూపించడం జరుగుతుందని వారు ముఖ్యమంత్రితో చెప్పారు. విభజన నిర్ణయం తర్వాత తమ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని కిరణ్ వద్ద పలువురు మంత్రులు ప్రస్తావించారట. ఆ సమయంలో కిరణ్ టి మంత్రులందర్నీ ఓసారి ప్రత్యేకంగా విందుకు ఆహ్వానిస్తానని చెప్పారట.
అంతకుముందు సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చాంబర్‌లో డికె అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్ బాబు తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం వారు సిఎంను కలిశారు.












Click it and Unblock the Notifications