ఒంటరిని కాను, విభజన ప్రమాదమైతే ఉంది: లగడపాటి
విజయవాడ: విభజన ప్రమాదమైతే ఉందని, అయితే ఎన్నికలకు ముందు విభజన జరగదని ఆశిస్తున్నామని, విభజన జరగకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తామని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తాను ఒంటరివాడిని కానని, రాష్ట్ర విభజన విషయంలో తన అంచనాలు నిజమని తెలిసిందని, విభజన ప్రమాదం ఉందని తాను చెబుతూ వస్తున్నానని, కానీ ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు తెలిసి వచ్చిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
పార్టీ నాయకులతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం స్వచ్ఛందంగా వచ్చిందని, అది ఆషామాషీ కాదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వంద శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర విషయంలో మేల్కొనని పార్టీలు ఇంకా ఉన్నాయని ఆయన అన్నారు. నాయకులూ ఉన్నారని ఆయన అన్నారు. ప్రజా శాసనానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనని, ఇది ప్రజాస్వామ్యమని, అన్ని పార్టీల్లో మార్పులు రావాలని, ప్రధానితో పాటు నాయకులంతా మారాలని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం ద్వారా ప్రభుత్వాలు పడిపోయే స్థితి వస్తుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము వివిధ పార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్క పార్టీతో ముడిపడిలేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలోనే తమ భవిష్యత్తు ఉంటుందని అందరూ తెలుసుకుంటారని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం పోయిందని ఆయన అన్నారు. విభజన వద్దని తమ పార్టీ అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. విభజన వల్ల తమ జీవితాలు దెబ్బ తింటాయని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లు రాకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులం రాజీనామా చేశామని ఆయన అన్నారు. లోకసభ సభ్యత్వం లెక్క కాదని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం, కాంగ్రెసు, సిపిఐ, బిజెపి వెనక్కి వెళ్లబోమని అంటున్నాయని, ఏ పార్టీ ముందు వెనక్కి వెళ్లాలనే సందిగ్ధం ఏర్పడిందని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బుల సంచీల నుంచి వచ్చిందని అన్నారని, కానీ అది నిజం కాదని, అది తెలుగుతల్లి గర్భసంచి నుంచి వచ్చిందని ఆయన అన్నారు. విభజనపై ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నామని లగడపాటి చెప్పారు. పార్టీ, ప్రభుత్వం వినకపోతే తాము ఉద్యమంలో భాగస్వాములం అవుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications