ఆశారాంకు లైంగిక సామర్థ్యం ఉంది: పోలీసులు
జోధ్‌పూర్: వివాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. రాజస్థాన్‌లోని జోధ్ పూర్‌లో గల ఎస్ ఎస్ వైద్య కళాశాలలో ఆశారాంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలో 72ఏళ్ల ఆశారాంకు లైంగిక సామర్థ్యం ఉన్నట్లు తేలిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. లైంగిక సామర్థ్యం ఉన్న స్వామిజీ నేరానికి పాల్పడే అవకాశం ఉందని వారు తెలిపారు.
16ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆశారాంపై ఆరోపణ. బాధిత బాలిక తల్లిదండ్రుల ఆశారాంను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశారాంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సెప్టెంబర్ 30లోపు లొంగిపోవాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున మరికొంత గడువు కావాలని ఆశారాం కోరారు.

కానీ పోలీసులు మధ్యప్రదేశ్ ఇండోర్ ఆశ్రమంలో శనివారం అర్ధరాత్రి ఆశారాంను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆశారాంను జోధ్‌పూర్‌కు తరలించారు. జోధ్‌పూర్ కోర్టులో హాజరు పర్చగా కోర్టు ఆశారాంకు ఒక రోజు కస్టడీ విధించింది. ఆదివారం ఆశారాంను సుమారు నాలుగు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు.
ఆశారాంను అరెస్ట్ చేయాలని దీక్ష చేసిన బాధితురాలి తల్లిదండ్రులు దీక్ష విరమించారు. ఆశారాం మద్దతుదారులు జోధ్ పూర్ లో ఆందోళనలు చేపట్టారు. ఆయన అరెస్ట్ సందర్భంలో మీడియా ప్రతినిధులు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. లైంగిక దాడికి సంబంధించి కేసు ఆశారాంపై బలంగా ఉందని పోలీసులు అంటున్నారు. దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని చెప్పారు.
ఆశారం మానసిక స్థితి బాగా లేదనే ఆయన కుమారుడి మాటల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆశారాం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యుల బృందం తేల్చిందని చెప్పారు. ఆశారాం పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications