3 నెలల్లో తెలంగాణ: సుప్తచేతనలో ప్రభుత్వం

రాష్ట్ర విభజన నేపథ్యంలో సమస్యలు తలెత్తితే ప్రభుత్వాన్ని సుప్తచేతనావస్థలో (సస్పెండ్ యానిమేషన్‌లో) పెట్టి ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నోట్‌ను రూపొందించి, దానికి సంబంధించిన కాపీని న్యాయశాఖకు పంపించినట్లు సమాచారం. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారనే ఊహాగానాలకు కూడా ఆ నోట్ తెర దించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని ఎకె ఆంటోనీతో పాటు కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేస్తూ ఢిల్లీ సమయం వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఢిల్లీ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవడానికి బదులు సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసే ఆలోచన చేయాలని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక్కి తగ్గబోరని కచ్చితంగా చెబుతూ నదీ జలాల పంపిణీ, విద్యుత్తు, తదితర వివాదాస్పద అంశాలను పార్టీ అధిష్టానం, కేంద్రం పరిష్కరిస్తాయని వారు చెబుతున్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అలోచన కూడా ఏమీ లేదని అంటున్నారు. సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని యధాతథంగా అమలు చేయడమే ఇప్పుడు చేసే పని అని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications