Lok sabha sumitra mahajan special status andhra pradesh new delhi rajya sabha parliament session murali mohan rammohan naidu aiadmk లోకసభ ప్రత్యేక హోదా పార్లమెంటు
లోకసభ నుంచి 12 మంది టీడీపీ ఎంపీల సస్పెన్షన్: 'ఏపీకి మోడీ అందుకే రావట్లేదు'
అమరావతి: విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం లోకసభలో ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. లోకసభ సభాపతి సుమిత్రా మహాజాన్ నాలుగు రోజుల పాటు వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభ ఆరంభం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు వారిని స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, మురళీ మోహన్, జేసీ దివాకర్ రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్‌లతో పాటు బుట్టా రేణుక కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.

12 మంది టీడీపీ ఎంపీల సస్పెన్షన్
స్పీకర్ సుమిత్రా మహాజన్ 12 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలపై రూల్ 374ఏ కింద సస్పెండ్ చేశారు. అనంతరం సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ ఎంపీలు లోకసభలోనే ఉండిపోయారు. వెల్‌లో బైఠాయించిన వారిని మార్షల్స్ బయటకు పంపించే ప్రయత్నం చేశారు. మరోవైపు కావేరీ జలాల ఇష్యూపై అన్నాడీఎంకే ఎంపీలు కూడా ఆందోళన చేస్తున్నారు. వారిని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఎవరైనా మోయాల్సిందే
పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని టీడీపీ ఎంపీలు శీతాకాల సమావేశాల సందర్భంగా సభలో, సభ వెలుపల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ ఎంపీ అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ... ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆ బాధ్యతను అది మోయాల్సిందేనని చెప్పారు.

అందుకే మోడీ ఏపీకి రావడం లేదు
అశాస్త్రీయ విభజన వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. దేశానికి ఉపయోగపడే పనులేవీ కేంద్రం చేయడం లేదని సుజనా చౌదరి ఆరోపించారు. ఏపీకి వస్తే అవమానం తప్పదనే ప్రధాని మోడీ రావడం లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోడీని గద్దె దింపి రాష్ట్రానికి హోదా తెచ్చుకుంటామని చెప్పారు.

ఎంపీల నిరసనలు
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, మాల్యాద్రి శ్రీరాం, మాగంటి బాబు, నిమ్మల కిష్టప్ప, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి, అవంతి శ్రీనివాస్, టీజీ వెంకటేశ్, మురళీ మోహన్, కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావులు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం, గురువారం కూడా నిరసన తెలిపారు.