అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. చంద్రబాబు మినహా
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవనున్నారు. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సమావేశాలకు వెళ్లాలని యనమల రామకృష్ణుడు సూచించారు. పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కూడా కాదని అసెంబ్లీకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు మొగ్గుచూపారు.

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో అందరి దృష్టి టీడీపీపై నెలకొంది. చట్ట సభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కూడా కాదని అసెంబ్లీకి వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొగ్గుచూపారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.
మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ.. వెళ్లిపోయారు. దీంతో ఆయన సభకు హాజరయ్యే అవకాశం లేదు. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇవాళ ఆన్ లైన్ లో టీడీఎల్పీ సమావేశం అయింది. ఆ మేరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మార్చి 8న గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. మార్చి11న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముంది. రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications