అమరావతి గ్రామాల్లో వైసీపీ జెండా: మూడు రాజధానులకు రెఫరెండమా? టీడీపీకి జీవన్మరణమేనా?
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకు పైగా సాగుతోన్న అమరావతి ప్రాంత పరిధిలోని పంచాయతీల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ఆసక్తి రేపుతోంది. అమరావతి ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వాన్ని వహిస్తోన్న తెలుగుదేశం పార్టీ.. చతికిలపడటం పట్ల భవిష్యత్తులో అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమౌతోంది. తాడేపల్లి సహా అమరావతి రీజియన్‌లోని గ్రామాల్లో తొలిదశలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించడాన్ని రెఫరెండంగా భావించే అవకాశాలు లేకపోలేదు.
వీడియో: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలింజిన్లో మంటలు: వికారాబాద్ జిల్లాలో ఘటన

తాడేపల్లి సహా..
అమరావతి ప్రాంత ఉద్యమానికి తాడేపల్లిని గుండెకాయగా భావించే తాడేపల్లి పంచాయతీలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఉన్నదిక్కడే. నాలుగు వందల రోజులుగా రాజధాని ప్రాంతంలోని 23 గ్రామాల్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతోన్న పరిస్థితుల్లో తాడేపల్లి పంచాయతీలో వైసీపీ గెలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గ్రామస్థాయిలో అమరావతి ఉద్యమ ప్రభావం లేనట్టేనా?
తాడేపల్లి సహా మంగళగిరి, తెనాలి వంటి నియోజకవర్గంలో తొలివిడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల విజయం సాధించడాన్ని ఆ పార్టీ నేతలు రెఫరెండంగా తీసుకుంటున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించడానికి పెద్దగా ఇష్ట పడట్లేదనే అభిప్రాయాలు వైసీపీ నేతల్లో వ్యక్తమౌతోన్నాయి. అమరావతి ప్రాంత ప్రజలు కూడా మూడు రాజధానులకే పట్టం కట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం వైపే మొగ్గ చూపుతోన్న తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకవడానికి ఇదే కారణమని అంటున్నారు.
తొలిదశ ఎన్నికల్లో అంచనా వేయగలరా?
తాజాగా ముగిసినవి తొలిదశ పంచాయతీ ఎన్నికలు మాత్రమే. ఇంకా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అమరావతి ప్రాంత ప్రజల పూర్తిస్థాయి తీర్పు ఎలా ఉంటుందనేది చివరి విడత పోలింగ్‌కు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తరువాతే తేలుతుంది. అమరావతి ఉద్యమ ప్రభావం గ్రామస్థాయిలో లేదనే విషయాన్ని ఒక్క విడత ఎన్నికల్లోనే నిర్ధారించలేమనే వాదనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ.. ఉద్యమ ప్రభావం ఉండి ఉంటే.. అమరావతి ప్రాంత పరిధిలో తొలివిడతలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్కచోట కూడా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించి ఉండకపోవచ్చని, మిగిలిన మూడు దశల్లో ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనడానికి దీన్ని నిదర్శనంగా భావింవచ్చని అంటున్నారు.