ఏపీకి అదనంగా రూ. 3716 కోట్లు అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి: సంస్కరణల అమలే కారణం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఏపీతోపాటు పది రాష్ట్రాలకు అదనంగా అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించింది. మొత్తంగా పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనప్పు అప్పులు చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదనంగా రూ. 3716 కోట్లు అప్పు చేసేందుకు అనుమతి ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో అమలవుతున్న సబ్సిడీ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాలతో డిస్కంలు ఎక్కువగా నష్టపోతున్నాయి. అధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలు నష్టాలను అరికట్టడానికి వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేశాయి. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఎప్ఆర్‌బీఎం పరిమితి అరశాతం పెంచినట్లు తెలుస్తోంది.

కాగా, దేశంలో 24.54 శాతంగా ఉన్న సగటు సరఫరా, వాణిజ్య నష్టాలను తగ్గించడానికి మీటరింగ్, బిల్లింగ్ విధానాన్ని డిస్కంలు మెరుగు పర్చుకోవాలి. కేంద్రం ప్రకటించిన పథకాన్ని వినియోగించుకుని సైబర్ సెక్యూరిటీతో ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పట్ల విద్యుత్ చౌర్యం తగ్గి, బిల్లుల వసూళ్లు పెరుగుతాయి. ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థల బకాయిలకు అవకాశం ఉండదని కేంద్రం విద్యుత్ సంస్కరణల్లో వెల్లడించింది.
అదనపు అప్పులు తీసుకోవడానికి అనుమతించబడిన రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,716 కోట్లు, అస్సాంకు రూ. 1,886 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 251 కోట్లు, మణిపూర్‌కు రూ. 180 కోట్లు, మేఘాలయకు రూ. 192 కోట్లు, ఒడిశాకు రూ. 2,725 కోట్లు, రాజస్థాన్‌కు రూ. 5,186 కోట్లు, సిక్కింకు రూ. 191 కోట్లు, తమిళనాడుకు రూ. 7,054 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ. 6,823 కోట్లు తీసుకునే అవకాశం కల్పించింది కేంద్రం.
ఇది ఇలావుండగా, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. అదనంగా అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా.. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సుమారు 25వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ తాము కేంద్ర విద్యుత్ సంస్కరణలను అమలు చేయలేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అదనంగా అప్పులు చేసుకునేందుకు అనుమతిచ్చిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications