ఏపీలో కాస్త తగ్గిన కరోనా కొత్త కేసులు, పెరిగిన మరణాలు: లక్షా 86వేలకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మూడు రోజులు వరుసగా 20వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో మాత్రం కరోనా కేసులు కాస్త తగ్గాయి. అయితే, కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,00,424 నమూనాలను పరీక్షించగా.. 17,188 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 17,188 కరోనా కేసులు, 73 మరణాలు
తాజాగా నమోదైన 17,188 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,45,374కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 73 మంది మృతి చెందారు. విజయనగరం జిల్లాలో 11 మంది మృతి చెందగా, విశాఖపట్నంలో 10 మంది, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరిలో 5, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 8519కి చేరింది.

ఏపీలో లక్షా86వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,749 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,50,160కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,71,60,870 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 2260 కరోనా కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1779, చిత్తూరులో 2260, తూర్పుగోదావరిలో 1823, గుంటూరులో 1515, కడపలో 620, కృష్ణాలో 780, కర్నూలులో 1342, నెల్లూరులో 1530, ప్రకాశంలో 385, శ్రీకాకుళంలో 1632, విశాఖపట్నంలో 1868, విజయనగరంలో 749, పశ్చిమగోదావరిలో 905 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. గత బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు.
Recommended Video

ఏపీలో రెండో కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకునేవారికే ప్రాధాన్యం
రాష్ట్రంలో మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోసు టీకాలు తీసుకునేవారికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. త్వరలో మరో 3.50 లక్షల డోసులు ఇచ్చేందుకు సీరమ్ సంస్థ అంగీకారం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలో రూ. 180 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. ఇక కరోనా విధుల్లోని సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications