విజయవాడకు ఫ్లడ్ అలర్ట్ జారీ
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా వాయుగుండంగా అనంతరం అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవించనుంది. దీని ప్రభావం ఏపీ సహా ఏకంగా మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది.
దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున తీరం తాకుతుంది.

మొన్నటివరకు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు దంచికొట్టాయి.
అటు కర్ణాటక, తెలంగాణల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువ తీర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణమ్మ మళ్లీ వరద తాకిడికి గురైంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలో ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ నిండిపోయింది.
శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు వరద నీటితో పోటెత్తాయి. నిండుకుండలా మారాయి. ఫలితంగా ఆయా రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడదల చేస్తోన్నారు జలమంత్రిత్వ శాఖ అధికారులు.
ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరదనీరు..భయం గుప్పిట్లో విజయవాడ ప్రజలు..!!#PrakashamBarraige #VijayawadaRains #VijayawadaFloods #AndhraPradesh #ApRains #Oneindiatelugu pic.twitter.com/d8deC5E0MW
— oneindiatelugu (@oneindiatelugu) October 22, 2024
దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇన్‌ఫ్లో భారీగా ఉంటోంది. దీనితో ప్రకాశం బ్యారేజీకి చెందిన 70 గేట్లను సోమవారమే ఎత్తివేశారు. వరద జలాలను దిగువకు విడుదల చేస్తోన్నారు. తొలి రోజున 1.18 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. నేటికి అది రెట్టింపయింది.
ఇన్‌ఫ్లో అధికంగా ఉండటం వల్ల దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్నీ పెంచారు. ప్రస్తుతం 2.06 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తోన్నారు. దానా తుఫాన్ ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులకు వరద పోటెత్తే అవకాశం ఉండటం వల్ల మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు విజయవాడకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల సమయంలో పాటించాల్సినవి/పాటించకూడనివి వివరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.
నదిని దాటే ప్రయత్నం చేయకూడదని, వరదనీటిలోకి ప్రవేశంచవద్దని సూచించారు. మురుగు నీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని కోరారు. విద్యుద్ఘాతానికి గురి కాకుండా ఎలక్ట్రికల్ పోల్స్, లైన్లకు దూరంగా ఉండాలని, ఓపెన్ డ్రెయిన్ లేదా మ్యాన్ హోల్స్ కనిపిస్తే ఆ ప్రదేశంలో ఎర్ర జెండాలు లేదా వాటికి అడ్డుగా బారికేడ్లను ఉంచాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications