మహా శివరాత్రికి 2427 టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: శ్రీశైలం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు
హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యం కోసం 2427 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవ క్షేత్రాలకు ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

శ్రీశైలం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు టీఎస్ఆర్టీసీ బస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

శ్రీశైలంకు ఈ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారికి హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌పీ కాలనీ, బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు తెలిపింది.

ఆ బస్సులపై 10 శాతం రాయితీ
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని.. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.

కీసరగుట్ట శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రూ. కోటి నిధులు మంజూరు
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. ఫిబ్రవరి 16-21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఈ నిధులను ఖర్చుచేయనున్నారు. ఈఏడాది కీసరగుట్ట ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిధులు మంజూరు చేశారు. గత ఏడాది శివరాత్రి సందర్భంగా 3 లక్షల మంది భక్తులు కీసరగుట్టకు రాగా.. ఈసారి ఐదు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications