వీడు మామూలోడు కాదు, సీఎం జిల్లాలో ఆడవాళ్లకు గాజులు, మగాళ్లకు మందు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలకు పైగా అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం ఇంకా ఉందని కొంతమంది ఊహల్లో ఉన్నారు. ప్రభుత్వం మారినా కొంతమంది వారి పద్ధతి మాత్రం మార్చుకోకుండా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విపరీతంగా మద్యం ధరలు పెరిగిపోవడంతో పొరుగు రాష్ట్రాల మధ్యం తాగడానికి మందుబాబులు అలవాటు పడ్డారు.
కర్ణాటక, తమిళనాడు, రాష్ట్రాల నుండి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కు మద్యం తరలిస్తున్న కొందరు వ్యక్తులు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలు గ్రామం గ్రామం తిరుగుతూ మహిళలు గాజులు అమ్ముతున్న ఆ వ్యక్తి మగాళ్లకు మాత్రం కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడు.

స్కూటర్ లో ఒక బాక్స్ కట్టుకుని దానిపైన గాజుల బాక్స్ పెట్టుకొని గాజులమ్మ గాజులో అంటూ ఊరు తిరుగుతూ మహిళలు కనపడితే వారికి గాజులు చూపిస్తున్నాడు. మహిళలతో బేరమాడి గాజులు విక్రయిస్తున్న ఆ వ్యక్తి గ్రామ శివారులో ఉన్న మగాళ్లతో మాట్లాడి కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటికీ కర్ణాటక మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని వెలుగు చూసింది.
చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం నల్లసానిపల్లె గ్రామం సమీపంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పట్టపగలు బైకులో వెళుతుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు అతని బైక్ ఆపారు. తాను గాజులు వ్యాపారం చేస్తున్నానని, మహిళలకు గాజులు అమ్మడానికే ఊరు ఊరు తిరుగుతున్నానని సుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పాడు. కావాలంటే మీరే చూడండి సార్ అంటూ బైక్ పైన కట్టిన బాక్స్ లోని గాజులను పోలీసులకు చూపించాడు. తాను మహిళలకి గాజులు అమ్ముతున్నానని, చాలా సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నానని సుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పాడు. అయితే అప్పటికే సుబ్రమణ్యం గురంచి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చేశారు.
సుబ్రమణ్యం గురించి అప్పటికే అసలు మ్యాటర్ పోలీసులకు తెలిసింది. పోలీసులు మాత్రం కింద బాక్స్ లో ఏముందో చూపించమని సుబ్రమణ్యంను ప్రశ్నించారు. కింద బాక్స్ లో కూడా గాజులే ఉన్నాయని, తాను గాజుల వ్యాపారం తప్పా ఏమి చేయనని సుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పాడు. పోలీసులు బలవంతంగా గాజుల బాక్సులు కింద ఉన్న బాక్స్ ను కిందకు దించి దాన్ని పరిశీలించగా అందులో కర్ణాటకలో తయారైన టెట్రా ప్యాకెట్ల మద్యం బయటపడింది.
గత మూడు నాలుగు సంవత్సరాల నుండి సుబ్రహ్మణ్యం కర్ణాటక నుండి టెట్రా ప్యాక్ మద్యం తీసుకువచ్చి గ్రామం గ్రామం తిరుగుతూ ఆ లిక్కర్ విక్రయిస్తున్నాడని పోలీసులు అన్నారు. ఆడవాళ్ళకి రంగు రంగుల గాజులు, మగాళ్లకు కర్ణాటక మద్యం విక్రయిస్తున్న మాయగాడు సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు సుబ్రహ్మణ్యం నుండి 450 ప్యాకెట్ల టెట్రా మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని గంగవరం పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications