ఏ కష్టమొచ్చిందో?: గుడికెళ్లి కుటుంబం అంతా ఆత్మహత్య
కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బర్మాశాల వీధికి చెందిన రాంప్రసాద్ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఆదివారం ఉదయాన్నే ప్రథమనంది ఆలయ సమీపంలోకి వెళ్లారు.
అక్కడ రాంప్రసాద్(38), అతని భార్య సత్యవతి(35), కుమారుడు విజయకుమార్(12), కుమార్తె శోభారాణి(10) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులు గమనించి 108 సిబ్బందికి సమాచారమందించారు.

108 సిబ్బంది వచ్చే సరికి రాంప్రసాద్, విజయకుమార్ మృతి చెందారు. కొన వూపిరితో ఉన్న సత్యవతి, శోభారాణిలను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మూడవ పట్టణ ఎస్సై సూర్యమౌళి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications