పెరిగిన ఉక్కపోత, మళ్లీ అల్పపీడనం - ఇక ఈ జిల్లాల్లో కుండపోత..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వరుస వర్షాలు .. వరదలతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. కాగా.. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. దీంతో.. ఈ నెలఖరు వరకు ఏపీలోని పలు జిల్లాల్లో నెలఖరు వరకు విస్తారం వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోనూ ఈ ప్రభావం కొనసాగనుంది.
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ, ఒడిశా, తెలంగాణ వైపు కదిలే అవకాశం ఉందని.. దీని కారణం గా ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిస్తాయని అంచనా వేసింది. మరో వైపు రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ విభాగం వెల్లడించింది. శుక్రవారం అనకాపల్లి, విజయనగం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత పెరిగింది.

కాగా, కాకినాడ..నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రాబోయే బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్, గుజరాత్ వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక.. కొద్ది రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. తెలంగాణలో కామారెడ్డిలో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు. నష్టపోయిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక.. తాజా అంచనాల మేరకు ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications