బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. బంగాళాఖాతం గగనతలంపై ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
బంగాళాఖాతం ఆగ్నేయం- నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీ, యానాం మీదుగా లోయర్ ట్రోపోస్పిరిక్ ఈశాన్యం, తూర్పు దిశగా వీస్తోన్న బలమైన గాలుల ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడుతుంది.

పశ్చిమం- మధ్య బంగాళాఖాతం వైపు ఈ అల్పపీడనం క్రమంగా విస్తరిస్తుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కరుణా సాగర్ చెప్పారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అక్టోబర్‌లో లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్న రాష్ట్రానికి ఈ వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తాయని కరుణసాగర్ వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో 90 శాతం లోటు కనిపించింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 161.5 మిల్లీమీటర్లు కాగా 16.3 మిల్లీ మీటర్ల మేర మాత్రమే వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 21వ తేదీన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడట్లేదు.
అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అంతే. ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications