వివాహేతర సంబంధం: ప్రియురాలి కోసం భార్యను కడతేర్చాడు
తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడ విద్యుత్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో మహిళతతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి(27) విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది.
కాగా, రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నూకరత్నం దేవి, శ్రీనివాసరావులకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు.

ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది.
సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి.. 'మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం' అని చెప్పాడు.
ఆందోళనకు గురైన తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండటం, అపార్ట్‌మెంట్‌లో తువాలు చుట్టి ఉండటంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications