కోడలి హత్యకు సౌదీలో ప్లాన్: ఏపీకి వచ్చి రెండ్రోజుల రెక్కీ, దొరికిపోయారు
చిత్తూరు: కన్న కూతురులా చూసుకోవాల్సిన కోడలిని హత్య చేసేందుకు కుట్ర పన్నింది ఓ అత్త. సౌదీ అరేబియాలో ఉంటున్న అత్త అకడ్నుంచే కోడలి హత్యకు ప్రణాళికలు వేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉండే తన కోడలిని హత్య చేయించేందుకు ఏకంగా ఆమె మరిదినే పంపింది. దీంతో మదనపల్లె చేరుకున్న అతడు.. హత్య ప్రణాళికలో భాగంగా రెండ్రోజులపాటు రెక్కీ కూడా నిర్వహించాడు. అయితే, హత్య కుట్రపై పోలీసులకు సమాచారం అందడంతో అతడు కటకటాల పాలు కావాల్సి వచ్చింది.
ఈ ఘటనపై మంగళవారం ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లెకు చెందిన ఈశ్వరమ్మ కొన్నేళ్లుగా సౌదీలో ఉంటూ భారీగా ఆస్తులను సంపాదించింది. ఆమెకు కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆమె సౌదీలో ఉండగానే కొడుకు వినయ్‌కుమార్ (23) ఏడు నెలల క్రితం గాలివీడు ప్రాంతానికి చెందిన అశ్విని (20)ని కులాంతర వివాహం చేసుకున్నాడు.

తమ కులం కాని ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవడంతో భవిష్యత్తులో ఆస్తిపాస్తుల సమస్యలు వస్తాయని భావించింది ఈశ్వరమ్మ. దీంతో కోడలిని హత్య చేసి అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ఇందుకు సౌదీలోనే ఉన్న మరిది గోవిందు అలియాస్ రమణతో ఆమె హత్యకు కుట్ర పన్నింది. ఎలాగైనా కోడలిని హత్య చేసి తిరిగి వచ్చేయని పురమాయించి ఇక్కడకు పంపించింది. దీంతో ఇటీవల మదనపల్లె చేరుకున్న గోవిందు ఓ వాహనం అద్దెకు తీసుకున్నాడు.
కోడలు కురబలకోట మండలంలోని ముదివేడులో ఉండటంతో రెండు రోజుల క్రితం అక్కడికి వచ్చాడు. ఇక్కడ అశ్విని భర్త వినయ్‌కుమార్‌తో కలిసి ఉంటోంది. ఇదే ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని అక్కడకు చేరుకున్నాడు రమణ. అశ్విని బయటకు వస్తే చంపేయాలని ముదివేడులో కాపుకాశాడు. లేదంటే ఆమె భర్త బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి చొరబడి చంపాలనుకున్నాడు.
అయితే అశ్విని గర్భిణీ కావడం ఆపై అనారోగ్యం వల్ల మదనపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లింది. విషయం తెలియక రెండు రోజుల పాటు కాపు కాసినా ఫలితం లేకపోయింది. ఈ లోపు హత్య కుట్ర విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.












Click it and Unblock the Notifications