బంగాళాఖాతంలో మరో ఆవర్తనం- ఏపీలో భారీ వర్షాలు
Bay of Bengal: మొన్నటివరకు బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావం వల్ల మూడు రాష్ట్రాలు గజగజ వణికాయి. భారీ వర్షాలు తీర ప్రాంత జిల్లాలను అల్లకల్లోలానికి గురి చేశాయి. లోతట్టు ప్రాంతాలను ముంచివేశాయి. దాదాపు ఏడు లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించాల్సి వచ్చింది.
దానా తుఫాన్ ప్రభావం ఏపీపైనా కనిపించింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.

ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం తూర్పు- ఆగ్నేయ ప్రాంతంలో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు అధికారులు గుర్తించారు. క్రమంగా ఈ ఆవర్తనం మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేశారు.
దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదు. ఈ ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారితే భారీ వర్షపాతం నమోదు కావొచ్చు.
ఆయా జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది. శనివారం కూడా అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇదే పరిస్థితి మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications