కులం వేరు కావడంతో పెళ్లికి 'నో'.. పోలీసులు మందలించడంతో ఆత్మహత్య..
ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత పోలీసులు పవన్ ను మందలించినట్లుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పవన్ శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
హిందూపురం: కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విషయం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు యువకుడిని మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని చిన్న మార్కెట్ వీధికి చెందిన పవన్, స్థానికంగా ఉండే ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమకు అడ్డుచెప్పారు.

పెద్దల అభ్యంతరంతో ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వారి పెద్దలను పిలిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత పోలీసులు పవన్ ను మందలించినట్లుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పవన్ శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పవన్ ఆత్మహత్యతో అతని కుటుంబ సభ్యులు హిందూపురం రోడ్డు పైకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల దాష్టికం వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications