ఇంటి ముందే టీడీపీ నేత కోటంరెడ్డిని కారుతో ఢీకొట్టిన యువకుడు, పరార్: చంద్రబాబు ఫోన్
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నాగవెంకట రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్దే జరిగిన ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు నాగవెంకట రాజశేఖర్ రెడ్డి అక్కడ్నుంచి పరారయ్యాడు.
తొలుత ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తన స్నేహితుడైన కోటంరెడ్డి కుమారుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో శ్రీనివాసులరెడ్డి.. అతడిని హెచ్చరించి బయటకు పంపేశాడు. ఆ తర్వాత ఇంటి బయట ఉన్న శ్రీనివాసులరెడ్డిని కారుతో వచ్చి ఢీకొట్టి పారిపోయాడు నాగవెంకట రాజశేఖర్ రెడ్డి. దీంతో కోటంరెడ్డి అక్కడే కుప్పకూలిపోయాడు.

వెంటనే కోటంరెడ్డిని కుటుంబసభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే, కాలుకు కొంత తీవ్రగాయమైనట్లు తెలుస్తోంది.
గత కొంతకాలం క్రితం రాజశేఖర్ రెడ్డి తమ ఇంటికొచ్చి గొడవకు దిగడంపై కోటంరెడ్డి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడి కారు వెనుక వేరే కారు కూడా ఉందని, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని కోటంరెడ్డి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వీరిమధ్య గొడవకు దారితీసిన అంశాలేంటో మాత్రం తెలియరాలేదు.
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు చంద్రబాబు. మరోవైపు, టీడీపీ సీనియర్ నేత సోమినేని చంద్రమోహన్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కోటంరెడ్డిని పరామర్శించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టించారని మండిపడుతున్నారు.