మద్యం మత్తులోరాష్ డ్రైవింగ్, పల్టీలు కొట్టిన కారు: టెక్కీ మృతి, ఇద్దరికి గాయాలు
రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంగేటి వంశీకృష్ణ(35) మృతి చెందాడు.
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంగేటి వంశీకృష్ణ(35) మృతి చెందాడు. అతని స్నేహితులు ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విశ్రాంత విజిలెన్స్ విభాగం మేనేజర్ మోహన్‌రావు కుమారుడైన వంశీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాడు. 3 నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు.
అయితే పాస్‌పోర్టు రెన్యువల్ కోసం విశాఖపట్నం వెళ్లాల్సి రావడంతో హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి రాజమహేంద్రవరంలో తన స్నేహితుడు బాలాజీ అతని సోదరుడు శ్రవణ్‌ను కలిశాడు. ముగ్గురూ విశాఖపట్నం వెళ్లి మంగళవారం తిరిగి వచ్చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక స్నేహితులు బాలాజీ, శ్రవణ్‌తో కలిసి వంశీ మరోసారి కారులో బయటకు వచ్చాడు.

ఆ సమయంలో బాలాజీ కారు నడుపుతున్నాడు. మోరంపూడి సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న బాలాజీ అతి వేగంగా కారుతో రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలోని డివైడర్‌ను ఢీకొట్టాడు. వెంటనే కారు పది ఫల్టీలు కొట్టి.. యస్వీ మార్కెట్ జంక్షన్ వద్ద చెట్టును ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది.
కారు పల్టీలు కొట్టడంతో బాలాజీ, శ్రవణ్ చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రమైన గాయాలతో బయటపడ్డారు. అయితే వంశీ సీటు బెల్టు పెట్టుకోవడంతో ఎటూ కదలకుండా ఉండిపోయాడు. దీంతో ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు ఇంటెలిజెన్స్ డీఎస్పీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బొమ్మూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ, శ్రవణ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications