TTD: తిరుమల భక్తులకు అలర్ట్, రూ. 300 నకిలి టిక్కెట్లు, స్కానింగ్ కౌంటర్ లో?
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి భక్తులను టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్న ముఠా తిరుమలలో విజిలెన్స్ వింగ్ అధికారులకు చిక్కింది. రూ. 300 ప్రత్యేక దర్శనం చేయిస్తామని శ్రీవారి భక్తులను నమ్మించి వారి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. నకిలి రూ. 300 టిక్కెట్ల కలర్ జిరాక్స్ టిక్కెట్లు భక్తులకు ఇచ్చి వారిని నిలువునా మోసం చేస్తూ విజిలెన్స్ అధికారులకు చిక్కిపోయారు.
తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎస్ఈడీ స్కానింగ్ కౌంటర్ లో పని చేస్తున్న రుద్రసాగర్, దళారి నవీన్ తేజ్ అలియాస్ తేజ్, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ డ్రైవర్ పెరియస్వామి అనే ముగ్గురు నిందితులు చిక్కిపోయారు. విజిలెన్స్ వింగ్ అధికారులు నిందితులను తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడు యాదవ్, నారాయణ కోసం గాలిస్తున్నామని తిరుమల టూటౌన్ పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎస్ఈడీ స్కానింగ్ కౌంటర్ లో పని చేస్తున్నరుద్రసాగర్, దళారి నవీన్ తేజ్, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ డ్రైవర్ పెరియస్వామి, యాదవ్, నారాయణ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తరువాత చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడిని సంప్రధించారు. రూ. 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇస్తామని, రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారని యాదవ్ అనే నిందితుడు చెన్నైకి చెందిన శ్రీవారి భక్తుడు మోహన్ రాజ్ ను నమ్మించారు.
తరువాత మోహన్ రాజ్ నుంచి రూ. 11 వసూలు చేసి నాలుగు టిక్కెట్లు అతనికి ఇచ్చాడు. మోహన్ రాజ్ అతని కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి బయలుదేరారు. ఆ సందర్బంలో విజిలెన్స్ పోలీసులకు అనుమానం వచ్చి మోహన్ రాజ్ దగ్గర ఉన్న దర్శనం టిక్కెట్లు పరిశీలించారు. ఆ సందర్బంలో మోహన్ రాజ్ దగ్గర ఉన్న టిక్కెట్లు నకిలి అని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఏపీ టూరిజం గతంలో శ్రీవారి భక్తులకు ఇచ్చిన పాత టిక్కెట్లను నిందితులు తీసుకుని వాటి సీరియల్ నెంబర్లు మార్చివేసి తరువాత వాటిని కలర్ జీరాక్స్ చేసి చెన్నై భక్తుడు మోహన్ రాజ్ కు ఇచ్చారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇలా నకిలి టిక్కెట్లు భక్తులకు ఇచ్చి తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఎస్ఈడీ స్కానింగ్ కౌంటర్ లో పని చేస్తున్నరుద్రసాగర్ సహాయంతో వారిని దర్శనం చేయిస్తున్నారని విజిలెన్స్, తిరుమల పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు యాదవ్, నారాయణ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications