ఆంధ్ర ద్రోహుల పార్టీ: బిజెపిపై శివాజీ ఫైర్
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని నటుడు శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకపోతే మరో బీహార్‌లా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సభల్లో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని గెలిచిన తరువాత మాట మార్చడం వాగ్దాన భంగం కాదా? ఈ విషయంలో బిజెపి ప్రజలను వంచించలేదా? అని ప్రశ్నించారు.
14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. కేంద్రం అతి తేలిగ్గా తీసుకోగలిగిన నిర్ణయాన్ని ప్రణాళికా సంఘం మీదకు నెట్టడం తప్పించుకోవడం కాదా? అంటూ బిజెపి నేత వెంకయ్య నాయుడికి పది ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలోని రెండు పార్టీలను అంతమొందించి బిజెపి ఆంధ్రలో పాగా వేయాలని చూస్తోందని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఇచ్చేవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపి సుజనాచౌదరి ఏపికి 10 వేల కోట్లు ఇచ్చామంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇదే తరహాలో వెంకయ్య నాయుడు తాను ఎంతో శ్రమించి 1500 కోట్లు ఆంధ్రకు కేటాయించానని చెప్పుకుంటున్నారని, వాస్తవంగా 1500 కోట్లు వెయ్యి కిలోమీటర్లు రోడ్డు వేయడానికి కూడా సరిపోదని అన్నారు.
తీవ్రవాదుల కంటే దారుణంగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్లు సంపాదించుకొని ఏం చేస్తారు? వారు బతకటానికి ఎన్ని కోట్లు కావాలని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ప్రతిపత్తి సాధించుకుందామని శివాజీ అన్నారు. తన దీక్షకు మద్దతు పలికిన వారికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications