విశాఖ-చెన్నై మధ్య ఐదు ఇండస్ట్రీయల్ జోన్లు: ఏపీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ది కోసం ప్రత్యేక ప్రాజెక్టు నెలకొల్పేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ముందుకొచ్చింది. మరో ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును సిద్దం చేయనున్నట్లు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా శాఖ డైరెక్టర్ శ్రీ హున్ కిమ్ తెలిపారు.
మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుతో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ ప్రత్యేక ప్రాజెక్టు కింద విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్‌లో 2.5 బిలియన్ డాలర్లు ఖర్చుతో ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తామని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ బృందం తెలిపింది.

విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, ఏర్పేడు-శ్రీకాళహస్తిలలో ఈ ఐదు ఇండస్ట్రీయల్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. జపాన్, చైనా, దక్షిణ కొరియా, యూరప్ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పించి, వారితో చర్చలు జరిపి పెట్టుబడులను సమీకరిస్తారు.
తద్వారా జోన్లలో పరిశ్రమల స్దాపనకు బాటలు వేస్తారు. ఆయా దేశాల పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి పరిశ్రమలు స్దాపించేలా తమ బ్యాంక్ సహకరిస్తుందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇండియా శాఖ డైరెక్టర్ తెలియజేశారు.

ఈ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేందుకు గాను ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ముఖ్యమంత్రికి తెలియజేసింది. మొత్తం ఆరునెలల్లో ఈ ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ హామీ ఇ్చచింది.
ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ బృందం ముఖ్యమంత్రితో జరిపిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సీఈఓ గంటా సుబ్బారావు పాల్గోన్నారు.












Click it and Unblock the Notifications