జగన్ పద్ధతులు నచ్చలేదు, ఇంకా మారలేదు: హోదాపై ఆదినారాయణ 'పంచ్'
కడప: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం నాడు వైసిపి అధినేత జగన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో తాను, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒక్కటయ్యామని చెప్పారు. ఇక నియోజవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్ పద్ధతులు నచ్చకపోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందడంతో తాను సైకిల్ ఎక్కానని చెప్పారు. ఏడు వేల పింఛన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. పులివెందుల కంటే జమ్మలమడుగులో పింఛన్లు ఎక్కువ ఇప్పిస్తున్నామన్నారు. మూడేళ్లయినా జగన్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు.

ఆరుగురు ఎంపీలతో లోకసభను ఎలా స్తంభింపచేస్తారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని, వారికి ఎల్లవేళాల రుణపడి ఉంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిలిపినా అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
ప్రత్యేక హాదా అంటే బిర్యానీతో సమానమని, అయితే మాంసం, చికెన్, చేప, కూరలు వేర్వేరుగా చేసి పెడితే తమకు వద్దు, మాకు బిర్యానే కావాలని జగన్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రత్యేక హాదా ఇక రాదని, జగన్ రెచ్చగొట్టే ప్రకటనలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రత్యేక ప్యాకేజి విషయంలో బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్నారు.
కూడు, గూడు, గుడ్డ నినాదంతో పుట్టిన టిడిపి రాజకీయాలకు నిర్వచనం నేర్పిందని రామసుబ్బా రెడ్డి అన్నారు. మహిళలకు స్వయం ఉపాధిని పెంపొందించి వారికి అన్ని విధాలా సహకారం అందించారన్నారు. కలిసికట్టుగా పనిచేసి నియోజవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications