ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి: బాబు చెప్పినా పొసగని ఐక్యత, దాడి
కడప: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఐక్యత సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు.
అయితే, ఇరు వర్గాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోగా, వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు గ్రామంలో జరిగింది.
రామసుబ్బారెడ్డి ఆదివారం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుతో కలిసి పెద్దండ్లూరు, సిరిగేపల్లెలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో మాట్లాడి కార్యక్రమం ముగించుకుని తిరిగి జమ్మలమడుగు చేరుకున్నారు.

సాయంత్రం సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు రామసుబ్బారెడ్డిని ఆహ్వానించిన కార్యకర్తలపై దాడికి దిగారు. ఎమ్మెల్యే అనుచరులు రామసుబ్బారెడ్డి వర్గీయులైన ఓబన్న, సంజీవరెడ్డితో పాటు మరికొందరిపై దాడులకు దిగారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ సర్కార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఆయా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే, ఫ్యాక్షన్ వీడాలని నీతులు చెబుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమవర్గం వారిపై దాడులు చేయించడం దుర్మార్గమని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభిమానంతో కార్యకర్తలు తమను పిలవడం తప్పా అని ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పి ఇలా దాడులకు దిగడం సబబు కాదన్నారు.












Click it and Unblock the Notifications