రామసుబ్బారెడ్డి వినతి బేఖాతరు: ఆదినారాయణ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు
కడప: పార్టీ నేత రామసుబ్బారెడ్డి విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ కడప జిల్లా జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని రామసుబ్బారెడ్డి ఒకటికి రెండు సార్లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.
అయితే, సొంత జిల్లా కడపలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ తీయడానికి ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్న నారా లోకేష్ రామసుబ్బారెడ్డి మాటలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 27 లేదా 30వ తేదీ టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ఈనెల 25, 26 తేదీల్లో తన ముఖ్యఅనుచరులు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకై ఆదినారాయణరెడ్డి అటు టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిసిన సంగతి తెలిసిందే. వారి నుంచి గ్రీన్‌సిగ్నల్ అందగానే తన అనుచరుల, నియోజకవర్గం కార్యకర్తలతో ఆది సమావేశమై దీనిపై చర్చించారు. అయితే ఆది చేరికపై రామసుబ్బారెడ్డితో పాటు స్థానిక టిడిపి నాయకులు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

కడప జిల్లాలో టిడిపిని బలోపేతం చేసే చర్యల్లో భాగంగానే ఆదినారాయణరెడ్డిని చేర్చుకుంటున్నట్లు పార్టీ అధిష్ఠానం స్థానిక టిడిపి నేతలకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. వారు చేరినా పాత నేతలకు ఎలాంటి కష్టం, నష్టం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పాటు జిల్లాకు చెందిన మరికొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫాక్షన్ నేపథ్యం ఉన్న జమ్మలమడుగు ప్రాంతంలో మొదటి నుండి దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల మధ్య రాజకీయవైరం కొనసాగుతోంది. ఓ పక్క ఎమ్మెల్యే ఆది కుటుంబం, మరోపక్క మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి కుటుంబం రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరితే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన నెలకొని ఉంది.
ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోసం దశాబ్దాల కాలంగా పార్టీకోసం పనిచేస్తున్న శివారెడ్డి కుటుంబంపై టిడిపి అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications