Adipurush:హనుమంతుడి సీటుకు హారతులు.. ప్రత్యేక పూజలు
అమరావతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. ఓం రౌత్ దర్శకుడు.
500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఈ పాన్ ఇండియా మూవీ ఇవ్వాళ విడుదలయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోట్లాదిమంది అభిమానులను పలకరించింది. ఆదిపురుష్ విడుదలైన ప్రతి థియేటర్ ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది.

సినిమాను చూడటానికి అర్ధరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరి నిల్చున్నారు. శ్రీరామచంద్రమూర్తిగా కనిపించిన ప్రభాస్ కటౌట్లకు నిలువెత్తు పూలమాలలు వేశారు. పాలాభిషేకాలు చేశారు. లీటర్ల కొద్దీ పాలను బిందెలతో పట్టుకొచ్చి కటౌట్లపై గుమ్మరించారు. చాలా చోట్ల ఆదిపురుష్ సినిమా థియేటర్లు కాషాయమయం అయ్యాయి. జై శ్రీరామ్ అని రాసివున్న కాషాయ జెండాలను కట్టారు అభిమానులు.
ట్విట్టర్ రివ్యూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా సూపర్ హిట్ అంటూ ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ల ద్వారా రివ్యూ ఇచ్చేశారు. సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటోన్నారు. మరికొందరు అభిమానులు మిక్స్డ్ రివ్యూలు ఇచ్చారు. గ్రాఫిక్స్ మయం కావడం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదనీ చెప్పినవారూ లేకపోలేదు.

ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్లల్లో కూడా ఒక సీట్‌ను హనుమంతుడి కోసం వదిలివేసిన విషయం తెలిసిందే. ఒక సీట్‌ను ఖాళీగా ఉంచాలని చిత్రం యూనిట్ ఇదివరకే సూచించింది. ఆ సీట్‌ను హనుమంతుడికి కేటాయించింది. ఆంజనేయస్వామి స్వయంగా వచ్చి ఈ సినిమాను చూస్తాడని యూనిట్ విశ్వసించడమే దీనికి కారణం.
రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికీ హనుమంతుడు విచ్చేస్తాడని భక్తులు నమ్ముతుంటారు. ఆ సంప్రదాయాన్ని, నమ్మకాన్ని గౌరవిస్తూ- రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ను సినిమాను చూడటానికి హనుమంతుడు వస్తాడని, రామభక్తునికి గౌరవ మర్యాదలను కల్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టామని పేర్కొంది.

ఈ నేపథ్యంలో- అభిమానులు ఆ సీటుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయుడి చిత్రపటాన్ని ఉంచి దానికి హారతులు ఇచ్చారు. పూలదండలు వేశారు. కొబ్బరికాయలను కొట్టారు. సినిమా ప్రారంభానికి ముందే సీటులో ఆంజనేయుడి చిత్రపటాన్ని ఉంచి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాలతో థియేటర్లు మారుమోగిపోయాయి.












Click it and Unblock the Notifications