US Crackdown: అమెరికాలో భారతీయులకు షాకులు..! ఒక్క జూన్ లోనే 800 మంది..!
ఒకప్పుడు డాలర్ కలలతో అమెరికా(US)కు వలస వెళ్లిన భారతీయులకు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వలస విధానాన్ని (Immigration) కఠిన తరం చేయడం, ఎప్పటికప్పుడు అందులో మార్పులు చేస్తుండటం, వీసా ఫీజులు పెంచేయడం , వీసాల జారీని ఆలస్యం చేస్తుండటం, అదే సమయంలో దేశంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్ని ముమ్మరం చేయడం ఇలా ఎటు చూసినా భారతీయులకు షాకులు తప్పడం లేదు. తాజాగా వీటి ప్రభావం మరింత పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను స్వదేశాలకు పంపేసే ప్రక్రియ మరింత వేగవంతమైంది. అమెరికా ఇమిగ్రేషన్ కోర్టులు జూన్ నెలలో ఏకంగా 801 మంది భారతీయ పౌరులను దేశం నుంచి పంపివేయాలని ఆదేశాలు జారీ చేశాయి. అమెరికాలో ఇమిగ్రేషన్ నిబంధనల అమలు ఎంత కఠినంగా మారుతోందో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. అంతకు ముందు మే నెలలో ఈ సంఖ్య 840గా నమోదైంది. జూన్‌లో ఇది స్వల్పంగా తగ్గినప్పటికీ.. మొత్తం మీద కేసుల పరిష్కార వేగం గణనీయంగా పెరిగింది.

అమెరికా న్యాయశాఖ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ట్రాక్ (TRAC) అనే పరిశోధన సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
అమెరికా వ్యాప్తంగా ఇమిగ్రేషన్ కోర్టులు కేసులను కొంతకాలంగా వేగంగా విచారిస్తున్నాయి. మే నెలలో అన్ని దేశాలకు కలిపి 58,339 తరలింపు ఆదేశాలు ఇవ్వగా, జూన్ నాటికి ఆ సంఖ్య ఏకంగా 30 శాతం మేర పెరిగి 78,882కు చేరుకుంది. ఆసియా దేశాల నుంచి అత్యధికంగా డీపోర్టేషన్ ఆదేశాలు అందుకున్న ఏకైక దేశంగా భారత్ నిలిచింది. ఇందులో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.

డీపోర్టేషన్ ప్రక్రియ సివిల్ వివాదం పరిధిలోకి వస్తుంది. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఐస్, బోర్డర్ పెట్రోల్ వంటి ఏజెన్సీలు నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇస్తాయి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ జడ్జీలు సదరు వ్యక్తి అమెరికాలో ఉండడానికి అర్హుడా కాదా అనే అంశాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. లాటిన్ అమెరికా దేశాలతో పోలిస్తే భారతీయ వలసదారుల సంఖ్య తక్కువే అయినా, డీపోర్టేషన్ ఆర్డర్ల పరంగా చూస్తే భారత్ అగ్రస్థానాల్లో ఉంటోంది. జూన్ నెలలో మెక్సికో అత్యధికంగా 15,773 రిమూవల్ ఆర్డర్లతో మొదటి స్థానంలో ఉండగా... వెనిజులా, హోండురాస్, గ్వాటెమాలా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికాలో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయులకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడి కోర్టులు ఇమిగ్రేషన్ కేసులను వేగవంతం చేస్తుండటంతో, రానున్న రోజుల్లో మరింత మంది స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications