US Visa: అమెరికా వీసా రూల్స్ లో భారీ మార్పు- ఇకపై వీరందరికీ షాకులే..!
అమెరికా ప్రభుత్వం గ్లోబల్ వీసా (US Global Visa) నిబంధనల్లో మరో కీలక మార్పు చేసింది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల నుంచి దేశానికి ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, లైంగిక వేధింపులు వంటి తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడే విదేశీయులపై కఠిన వీసా ఆంక్షలు విధిస్తూ విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాల నుంచి డిజిటల్ మోసాలకు పాల్పడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని , అక్రమార్కులకు అమెరికా వీసాలు నిరాకరిస్తామని అధికారికంగా ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ నూతన గ్లోబల్ వీసా నియంత్రణ విధానాన్ని అధికారికంగా వెల్లడించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ప్రకారం ఈ నిబంధనలను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. వీటి ప్రకారం కేవలం సైబర్ నేరాలకు స్వయంగా పాల్పడేవారే కాకుండా, ఆయా నేరాల్లో భాగస్వాములైన వారు, వాటికి సహకరించిన వారి కుటుంబ సభ్యులపై కూడా వీసా ఆంక్షలు విధించే వీలుందని రూబియో స్పష్టం చేశారు. తాజా నివేదికల ప్రకారం ఆన్‌లైన్ పెట్టుబడుల స్కామ్‌లు, బెదిరింపుల వల్ల అమెరికా పౌరులు ప్రతి ఏటా భారీగా నష్టపోతున్నారు. ముఖ్యంగా చైనాకు చెందిన అంతర్జాతీయ నేర ముఠాలు 2024 లోనే అమెరికన్ల నుంచి దాదాపు 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని దోచుకున్నాయి. ఈ అక్రమ నిధులను వారు మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి ప్రమాదకరమైన కార్యకలాపాలకు వాడుతున్నారు.

అలాగే అమెరికాకు చెందిన చిన్నారుల్ని లక్ష్యంగా చేసుకుని విదేశాల నుంచి సెక్స్‌టార్షన్ మోసాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని రూబియో తెలిపారు. సాధారణంగా వీసా దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ చరిత్రను పరిశీలించే అమెరికా విదేశాంగ సంస్థ ఇప్పుడు గ్లోబల్ డిజిటల్ నేరాలను అరికట్టడానికి కూడా ఆంక్షల్ని బలమైన వ్యూహాత్మక ఆయుధంగా మల్చుకుంటోంది. గతంలో రాజకీయ హింసను ప్రోత్సహించే వారిపై, డ్రగ్ కార్టెల్ నిర్వాహకులపై, సరిహద్దు రక్షణను దెబ్బతీసే వారిపై కూడా అమెరికా ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్ారు. ఈ తాజా సైబర్ వీసా విధానం అమెరికన్ పౌరుల రక్షణకు, ముఖ్యంగా టెక్నాలజీ ప్రపంచంలో భవిష్యత్ తరాల భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.














Click it and Unblock the Notifications