ఏబీ వెంకటేశ్వరరావు కీలక నిర్ణయం..! త్వరలో కొత్త పార్టీ..!
విజయవాడ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా సడన్ ఎంట్రీ ఇచ్చి, కమ్యూనిస్టులు-కాంగ్రెస్ మద్దతు తీసుకుని పోటీ చేసి కేవలం 12 వేల ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ఇప్పుడు మరో సంచలనం దిశగా అడుగులేస్తున్నారు. విజయవాడ ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్ కోల్పోయానన్న ఆవేదనో లేక ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలో తెలియదు కానీ ఇప్పుడు ఆయన కొత్త రాజకీయ పార్టీ స్థాపన దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు.
నవంబర్ రెండో వారంలో స్వేచ్ఛా వాదుల గ్లోబల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లే ఆలోచన ఉందని, దాని ప్రకారం ఇప్పుడే న్యూయార్క్ చేరానని ఏబీ వెంకటేశ్వరరావు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. తిరిగి రాగానే మీడియా సమావేశం, త్వరలోనే పెట్టబోయే పార్టీ వివరాలు ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల సరళి, తప్పొప్పులపై సమీక్ష పూర్తయిందని, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళదాం అంటూ ఆయన మద్దతుదారుల్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

అయితే ఏబీ వెంకటేశ్వరావు నిజంగానే కొత్త రాజకీయ పార్టీ పెడతారా, పెడితే విజయవాడ ఎన్నికల్లో ఆయన చెప్పిన అభివృద్ధి అజెండా, భూముల విషయంలో చేస్తున్న పోరాటాలు కొనసాగించేలా ఉంటుందా, మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్, కమ్యూనిస్టులతో ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది, మాజీ బాస్ చంద్రబాబుతో పాటు ఆగర్భ శత్రువు వైఎస్ జగన్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్న అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ మేయర్ ఎన్నికల్లో లాస్ట్ మినిట్ లో ఎంట్రీ ఇచ్చినా, గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా డిపాజిట్ కోల్పోవడం చర్చనీయాంశమైంది. ఏబీ ఓటమి తర్వాత కూడా ఆయన వెనుక ఎవరున్నారనే దానిపై కూటమి పార్టీలు, వైసీపీ మధ్య సోషల్ పోరు ఇంకా కొనసాగుతుండటం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపుగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications
