H1B visa: నాలుగు కంపెనీలపై నిషేధం విధించిన అమెరికా..
అమెరికాలో ఉద్యోగం చేయాలనేది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల కల. అందుకోసం హెచ్-1బీ వీసా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే, విదేశీ ఉద్యోగులను నియమించుకునే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన నాలుగు సంస్థలపై అమెరికా కార్మిక శాఖ కఠిన చర్యలు తీసుకుంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ కింద కొత్తగా విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయకుండా ఈ కంపెనీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ నాలుగు కంపెనీలు ఇవే...
అమెరికా కార్మిక శాఖ అందించిన సమాచారం ప్రకారం... నిబంధనలను ఉల్లంఘించినందుకు గౌరాటెక్ ఎల్‌ఎల్‌సీ (GowraTech, LLC), రెనోటెక్ గ్రూప్ ఎల్‌ఎల్‌సీ (Renotek Group LLC), సీలోజ్ ఇంక్ (Seeloz, Inc.), షేర్‌వుడ్ అకాడమీ (Sherwood Academy) పేరుతో వ్యవహరించే షేర్‌వుడ్ ఎట్ మౌంట్ డోరా ఇంక్ అనే సంస్థలపై నిషేధం విధించారు. నిబంధనలను బట్టి ఒక్కో కంపెనీపై రెండేళ్ల కాలపరిమితితో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నిషేధ కాలంలో ఈ సంస్థలు కొత్తగా ఎలాంటి హెచ్-1బీ పిటిషన్లను దాఖలు చేయడానికి వీలుండదు.

ఎందుకు ఈ కఠిన నిర్ణయం
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఈ కంపెనీలను.. ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించినవారిగా వర్గీకరించారు. సాధారణంగా దరఖాస్తుల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే ఈ స్థాయి చర్యలు ఉండవు. కానీ, ఉద్దేశపూర్వకంగా చట్టాలను తుంగలో తొక్కడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, కార్మిక నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలడంతోనే ఈ సంస్థలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.
స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వలేదనే కోపంతో...
ఈ కేటగిరీ కిందకు వచ్చిన కంపెనీలు కొత్తగా విదేశీయులను చేర్చుకోవడానికి వీలుండదు. అంతేకాకుండా, విదేశీ అభ్యర్థులను తీసుకునే ముందు స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా లేదా? అనే అంశంపై కఠినమైన తనిఖీలు ఉంటాయి. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికా స్థానిక ఉద్యోగులు ఉపాధి కోల్పోకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ తరహా నిబంధనలను కఠినతరం చేస్తోంది. రాబోయే ఐదేళ్ల వరకు ఈ కంపెనీలపై అమెరికా కార్మిక శాఖ నిఘా కొనసాగుతుంది.
భారతీయ నిపుణులకు వచ్చే నష్టమేమిటి?
సాధారణంగా భారతీయ అభ్యర్థులలో అత్యధికులు ఈ తరహా కంపెనీలపై నేరుగా ఆధారపడరు కాబట్టి, మెజారిటీ భారతీయ ఐటీ నిపుణులపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే, అమెరికాలో ఏదైనా కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చినప్పుడు లేదా వీసా ప్రక్రియను ప్రారంభించే ముందు, ఆ సంస్థకు హెచ్-1బీ వీసాలు స్పాన్సర్ చేసే అర్హత ఉందో లేదో అధికారికంగా సరిచూసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications