Canada: వర్క్ పర్మిట్లపై కఠిన నిబంధనలు. భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..
ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం కెనడా వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు అక్కడి ప్రభుత్వం నుంచి ఊహించని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని విద్యాసంస్థలు వర్క్ పర్మిట్ ఇప్పిస్తామని నమ్మబలికి కోర్సుల్లో చేర్చుకున్నప్పటికీ, చదువు పూర్తయ్యాక ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లను తిరస్కరించడంతో వందలాది మంది విద్యార్థులు వీధిపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ శాఖ విదేశీ విద్యార్థులు, కార్మికులు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
అక్రమంగా పనిచేస్తే దేశం నుంచి బహిష్కరణే!
తగిన అనుమతులు, సరైన అనుమతి పత్రాలు లేకపోయినా దొంగచాటుగా ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇమ్మిగ్రేషన్ శాఖ గట్టిగా హెచ్చరించింది. చట్టవిరుద్ధంగా పనిచేస్తూ దొరికితే తక్షణమే దేశం నుంచి పంపించి వేయడమే కాకుండా, ఐదేళ్ల పాటు కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారి ఇమ్మిగ్రేషన్ రికార్డులో 'మోసం' అని శాశ్వతంగా నమోదవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో పీఆర్ లేదా ఏ రకమైన వీసా రావడం అసాధ్యమని, పైగా ఉద్యోగాల పేరుతో దోపిడీకి గురయ్యే ప్రమాదం కూడా ఉందని అధికారులు స్పష్టం చేశారు.

వీసా ఉంటే సరిపోదు.. వర్క్ పర్మిట్ ఉండాల్సిందే!
విదేశీయులు కెనడాలో చట్టబద్ధంగా పనిచేయాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలని ఐఆర్‌సీసీ స్పష్టం చేసింది. కేవలం విజిటర్ వీసా లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఉన్నంత మాత్రాన అక్కడ పనిచేసే హక్కు రాదని తేల్చిచెప్పింది. అలాగే విజిటర్ వీసాలపై వచ్చి దేశంలోపల నుంచే వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం కుదరదని కుండబద్దలు కొట్టింది. చదువుకునే సమయంలో ఆఫ్ క్యాంపస్‌లో పనిచేయడానికి అనుమతి ఉన్న విద్యార్థులు క్లాసులు జరుగుతున్నప్పుడు వారానికి గరిష్టంగా 24 గంటలు మాత్రమే పనిచేయాలని, ఈ పరిమితి దాటితే విద్యార్థి స్టేటస్ రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.
ఇమ్మిగ్రేషన్ మోసాల పట్ల అప్రమత్తత అవసరం!
ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులను ఆసరాగా చేసుకుని జరిగే రకరకాల మోసాలపై ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
- వర్క్ పర్మిట్ లేదా జాబ్ ఆఫర్ పేరిట డబ్బులు డిమాండ్ చేయడం.
- ఉద్యోగం ఇప్పిస్తే గ్యారెంటీగా పర్మనెంట్ రెసిడెన్సీ (PR) వస్తుందని నమ్మబలకడం.
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత పత్రాలు, సొమ్ము వసూలు చేయడం.
- పర్మిట్ గడువు ముగిసినా దేశంలో ఉండొచ్చని అబద్ధాలు చెప్పడం.
- పని చేస్తే ఉచిత వసతి కల్పిస్తామనే ఆఫర్లు ఇవ్వడం.
ఇలాంటి ఉచ్చులో పడకూడదని, ఎలాంటి ఇమ్మిగ్రేషన్ సమాచారమైనా కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే సరిచూసుకోవాలని కెనడా ప్రభుత్వం విద్యార్థులకు సూచించింది.














Click it and Unblock the Notifications