రూ.500 కే హైదరాబాద్ సిటీ ట్రిప్..! నగరంలో ఏమేం చూడొచ్చంటే..?
హైదరాబాద్ మహా నగరానికి వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. కాకతీయుల కాలం నుంచే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతూ వస్తోంది. కుతుబ్ షాహీలు, నిజాం ప్రభువుల కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో అనేక చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు, షాపింగ్ మాల్స్ కాలక్రమేనా ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాంతాలను చుట్టేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ హైదరాబాద్ మహా నగరాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే తక్కువ ధరకే హైదరాబాద్ లోని 9 కీలక పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, నిజాం కాలం నాటి రాజ భవనాలు, షాపింగ్ మాల్స్ ఇతర ప్రాంతాలను ఒకే రోజులో సందర్శించే అవకాశం కల్పించే విధంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ప్రత్యేక సిటీ హెరిటేజ్ అండ్ మ్యూజియం టూర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కేవలం రూ.550 తోనే నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట సహా మొత్తం 9 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.
తెలంగాణ పర్యాటక శాఖ తీసుకొచ్చిన ఈ టూర్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ కు దేశీయ, విదేశీ పర్యటకులతో పాటు స్థానికుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రేజీ టూర్ లో భాగంగా పర్యటకులు ముందుగా బిర్లా మందిర్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి చౌమహల్లా ప్యాలెస్ సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి చార్మినార్, మక్కా మసీదు కట్టడాలను సందర్శిస్తారు. అక్కడే ఉన్న లాడ్ బజార్ లో షాపింగ్ చేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సాలార్ జంగ్ మ్యూజియం విశేషాలను చూస్తారు.
ఈ మ్యూజియంలో ప్రపంచంలోనే అరుదైన కళాఖండాలు, ఆయుధాలు, చారిత్రక వస్తువులు, శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇక్కడే భోజన విరామం కూడా ఉంటుంది. ఆ తర్వాత పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంను సందర్శిస్తారు. అక్కడినుంచి చారిత్రక గోల్కొండ కోట సందర్శన ఉంటుంది. గోల్కొండ పక్కనే ఉన్న కుతుబ్ షాహీ టోంబ్స్ ను సందర్శిస్తారు. ఇక చివరగా లుంబినీ పార్క్, ఖైరతాబాద్ వద్ద టూర్ క్లోజ్ అవుతుంది.

అయితే ప్రతి శుక్రవారం నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ మూసివేత కారణంగా వాటి స్థానాల్లో నెహ్రూ జూ పార్క్ సందర్శనకు చేర్చారు. అలాగే చంచల్ గూడ జైలులో నిర్వహిస్తున్న ఫీల్ ది జైల్ కార్యక్రమాన్ని కూడా పర్యాటకులు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే పెద్దలకు రూ. 550 గా ఉంది. అలాగే పిల్లలకు రూ. 440 గా ఛార్జి ఫిక్స్ చేశారు. ఈ ప్యాకేజీలో పర్యాటక ప్రాంత ప్రవేశ టికెట్లు, భోజన ఖర్చులు ఉండవు. ఆసక్తి కలిగినవారు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి నేరుగా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications