రవితేజ 'ఇరుముడి' మరో సెన్సేషన్.. ఓటీటీలోనూ తగ్గేదేలే..!
మాస్ మహారాజ రవితేజ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీ 'ఇరుముడి' థియేటర్లలో ఎంతటి ఘనవిజయం సాధించిందో మనం చూశాం. గతనెల అంటే ఆగస్టు 21న రిలీజైన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డివోషనల్, సస్పెన్స్ తో పాటు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు.
దాదాపు ఏళ్ల పాటు థియేటర్లలో సినిమాను చూడని వాళ్లు సైతం ఇరుముడి చూసేందుకు తరలిరావడం ఇటీవలి కాలంలో ఈ సినిమాకే జరిగింది. కేవలం మౌత్ టాక్ తోనే వైల్డ్ ఫైర్ లా ఈ మూవీ అంటుకుంది. దాంతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా ప్రతి థియేటర్ లో దాదాపు పండగ వాతావరణం కొనసాగింది. ఇక ఈ మూవీలోని మల్లెపూల పల్లకి, కట్టుకట్టు ఇరుముడి కట్టు పాటలను ప్రేక్షకులు థియేటర్లలో తెగ ఎంజాయ్ చేశారు.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇరుముడి మూవీ కొత్త ఊపిరిని అందించినట్లుగా భావించవచ్చు. కథలో కంటెంట్ ఉంటే చాలు భారీ బడ్జెట్ లు అవసరం లేదు. చిన్న సినిమానే సెన్సేషన్ అవుతుందని ఇరుముడి నిరూపించింది. థియేటర్లలో దాదాపు రూ. 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో అదరగొట్టిన ఇరుముడి సినిమా ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లిష్ మూవీస్ కేటగిరీలో గ్లోబల్ స్థాయిలో మూడో స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

భారత్ సహా 11 దేశాల్లో ఇరుముడి మూవీ టాప్ 10 స్థానంలో కొనసాగుతోంది. మున్ముందు ఓటీటీలో ఇంకెన్ని రికార్డుల్ని బద్దలు కొడుతుందో చూడాలి. ఇక ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా అలరించింది. ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్ర చేశారు. ఇరుముడి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.












Click it and Unblock the Notifications
