రాబోయేది మెగా ఎల్ నినో: ఇప్పటికే 10 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత: ఇక ముందూ.. !!
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరుగుతోన్నాయి. దక్షిణ అమెరికా సమీపంలోని గాలాపగోస్ ఐలండ్స్, పెరూ తీర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదుకావడం ఆందోళనకు గురి చేస్తోంది. వీటి తీవ్రత రాబోయే రోజుల్లో ప్రపంచ వాతావరణ సైకిల్ ను సైతం తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తోన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు ర్యాన్ మే పసిఫిక్ సముద్రంలో చోటు చేసుకుంటూ వస్తోన్న ఈ తీవ్ర పరిణామాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ఓ నివేదికను విడుదల చేశారు. దీన్ని న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఈ పరిణామాలను మెగా ఎల్ నినో గా అభివర్ణించారు. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్ అందించిన డేటా ఆధారంగా రూపొందించిన శాటిలైట్ ఫొటోల్లో ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించినట్లు చెప్పారు.

పసిఫిక్ సముద్రం పరిధి మొత్తం కూడా ఇదే తరహా వాతావరణం ఉండట్లేదు. ఒక్కో రీజియన్ లో ఒక్కోరకంగా ఉపరితల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అన్ని రీజియన్లలోనూ సాధారణం కంటే10 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత ఉండట్లేదు. పసిఫిక్ మధ్య భాగంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఎక్కువగా రికార్డయింది. అయినప్పటికీ.. ఆయా రీజియన్ల్నింటినీ ప్రభావితం చేసే తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో వాతావరణం వేడెక్కిందని, దీని ప్రభావం మిగిలిన రీజియన్లపై పడుతుందని ర్యాన్ మే అంచనా వేశారు.
యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ వివరాల ప్రకారం, పెరూ తీర ప్రాంతం, గాలాపగోస్ పశ్చిమ సముద్ర జలాల్లో సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా తూర్పు నుంచి పశ్చిమానికి వీచే గాలులు బలహీనపడినప్పుడు, వేడి సముద్ర జలాలు తూర్పు వైపునకు విస్తరిస్తాయి. ఈ పరిణామం రాబోయే డిసెంబర్ నాటికి గరిష్టస్థాయికి చేరుకుంటోందని ర్యాన్ మే వివరించారు. ప్రస్తుతం ఎల్ నినో విస్తరిస్తోన్న వేగం, దీని తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
+10°C sea surface temperature anomaly near Galapagos 🐢and off coast of Peru. This is now a Mega El Niño. https://t.co/xfavOfY16L
— Ryan Maue (@RyanWeather) November 22, 2026
అమెరికా నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో సిస్టమ్ అసాధారణ రీతిలో బలోపేతమైంది. పసిఫిక్ సముద్రంలోని నినో 3.4 రీజియన్ లో ఉష్ణోగ్రత అదనంగా 2.5 డిగ్రీలు, తీర ప్రాంతమైన నినో 1+2 పరిధిలో ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. 1950 నుంచి అందుబాటులో ఉన్న చారిత్రక రికార్డులను పరిశీలిస్తే.. 1997-98, 2015-16 కాలంలో నమోదైన అత్యంత తీవ్రమైన ఎల్ నినో పరిస్థితులను కూడా ఇది దాటిపోయే అవకాశం 60 శాతం వరకు ఉందని నోవా స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
