కట్టు తప్పిన కూటమి ధర్మం, సొంత అభ్యర్దికి మద్దతు- పవన్ సీరియస్..!!
ఏపీలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి పార్టీల సీట్ల పంపకాల నిర్ణయాలకు భిన్నంగా ఎన్నికలు జరగటం కూటమిలో సంచలనంగా మారింది. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో, అనేక ప్రాంతాల్లో ఎన్నిక వాయిదా పడింది. పిఠాపురంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పీఏ పైనే సొంత పార్టీ నేతలు దాడికి దిగారు. కాగా, కూటమి ధర్మం కట్టుతప్పటం పైన జనసేనాని పవన్ స్పందించారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మున్సిపల్ వైస్ ఛైర్మన్ స్థానాల పై కూటమిలోని మూడు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి. దీనికి అనుగుణంగా తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ప్రకటించిన అభ్యర్దులకు మద్దతు మిత్రపక్షాల నుంచి లభించ లేదు. జనసేన మంత్రి కందుల దుర్గేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ ఎన్నికలో కూటమి ధర్మం కట్టుతప్పింది. సీట్ల కేటాయింపులో భాగంగా చైర్పర్సన్ స్థానాన్ని జనసేనకు, వైస్‌చైర్‌పర్సన్ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. కాగా, మున్సిపాల్టీలో ముందుగా 32 మంది కౌన్సిలర్లతో, తర్వాత చైర్పర్సన్ మురాల జ్యోతితో కమిషనర్ తోట కృష్ణవేణి ప్రమాణం చేయించారు. అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. పొత్తులో భాగంగా టీడీపీ కౌన్సిలర్ కొమ్మిన వెంకటేశ్వరావును జనసేన బలపరచాలి.

మంత్రి దుర్గేశ్ పై పవన్ ఆగ్రహం
కాగా, ఎన్నిక సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాలుగో వార్డు జనసేన కౌన్సిలర్ కల్యాణ చక్రవర్తిని 8వ వార్డు జనసేన కౌన్సిలర్ గంగుల వెంకటలక్ష్మి ప్రతిపాదించగా.. ఆరో వార్డు కౌన్సిలర్ సంజీవ్ సాగర్ బలపరిచారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు. వెంటనే వారు కొమ్మిన వెంకటేశ్వరావును ప్రతిపాదించి మద్దతిచ్చారు. ఓటింగ్‌లో జనసేన కౌన్సిలర్లు 15 మంది, ఒక బీజేపీ కౌన్సిలర్, ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు కలిపి మొత్తం 18 మంది కల్యాణచక్రవర్తికి అనుకూలంగా చేతులు లేపారు. టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లే వచ్చాయి. దీంతో కల్యాణచక్రవర్తి వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీని పైన టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందానికి జనసేన నేతలు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కాగా, ఈ పరిణామాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి దుర్గేశ్ నియోజకవర్గంలోనే కూటమి స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించడంపై ఆయన నుంచి వివరణ కోరారు. మంత్రి స్పందిస్తూ.. క్షేత్ర స్థాయి నాయకులతో చర్చించి అధిష్ఠానం నిర్ణయం అమలు జరిగేలా చూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications
