రేపు బెంగళూరులో ఈ ప్రాంతాల్లో కావేరీ వాటర్ బంద్.. !!
బెంగళూరులో కావేరీ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కావేరీ పంపింగ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా బుధవారం తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు బెంగళూరు వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకటించింది. తాగునీటి అవసరాల కోసం ప్రజలు ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించింది.
కావేరి వాటర్ వర్క్స్ జోన్ పరిధిలో ఉన్న టీకే హళ్లి, హారోహళ్లి, తాతగుణి వాటర్ ట్రీట్మెంట్ పాయింట్లల్లో పాత పంపింగ్ పరికరాల స్థానంలో కొత్తవి అమర్చడం, అత్యవసర మరమ్మతులు నిర్వహించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా కావేరి నీటి సరఫరా పరిధిలోని అన్ని పంపింగ్ స్టేషన్లు కూడా 12 గంటల పాటు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. దీనివల్ల నగరంలోని పలు నివాస ప్రాంతాలకు నీటి పంపిణీ ఆగిపోనుంది.

రాబోయే రోజుల్లో బెంగళూరుకు కావేరి నీటి సరఫరాలో ఎలాంటి సాంకేతిక సమస్యలు, లీకేజీలు తలెత్తకుండా ఉండటానికే ఈ మరమ్మతులు, పైప్ లైన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ నీటి సరఫరా అంతరాయం నేపథ్యంలో నగరవాసులు తమ రోజువారీ అవసరాలకు సరిపడా తాగునీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
- ఆయా పంపింగ్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే బనశంకరి, బసవనగుడి, హనుమంతనగర, జయనగర్, జేపీ నగర్, ఉత్తరహళ్లి, పద్మనాభనగర్, కత్రిగుప్పె, కుమారస్వామి లేఅవుట్, గిరినగర్, హొసకెరె హళ్లి, నాయండహళ్లి, రాజరాజేశ్వరినగర్ వంటి ప్రాంతాలకు కావేరీ జలాల నీటి సరఫరా నిలిచిపోనుంది.
- వీటితో పాటు రామ్మూర్తినగర్, హొరమావు, మాదాహళ్లి, దేవసంద్ర, బసవనపుర, సొన్నేనహళ్లి, బిద్రహళ్లి, సిల్క్ బోర్డ్, మార్థహళ్లి, మహదేవపుర, వైట్ ఫీల్డ్, హూడీ ఇండస్ట్రీలయ్ ఏరియా, ఐటీపీఎల్ కారిడార్, కేఆర్ పురం.. వంటి పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచివపోయే అవకాశం ఉంది.
- సాయంత్రం 6 గంటలకు మరమ్మతు పనులు ముగిసిన వెంటనే పంపింగ్ స్టేషన్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు జలమండలి ప్రకటించింది. పంపింగ్ వ్యవస్థల నుంచి చివరి కనెక్షన్ల వరకు నీరు చేరడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. బుధవారం రాత్రికి నీటి సరఫరా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి చేరుకుంటుందని వివరించారు. ఈ పనులకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications
