వంగవీటి రాధాకు విజయవాడ ఎమ్మెల్యేల షాక్..! తొలిరోజే మొదలు పెట్టేశారా?
విజయవాడ నగర పాలక సంస్ధకు జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున మేయర్ గా పోటీ చేసి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. నగరంలోని అంబేద్కర్ కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో తాజాగా ఎన్నికైన మున్సిపల్ కార్పోరేటర్లంతా హాజరై ప్రమాణాలు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మేయర్ గా ప్రమాణం చేసిన వంగవీటి రాధాకు తొలిరోజే షాక్ తగిలింది.
వంగవీటి రాధా మేయర్ గా ప్రమాణం చేస్తున్న వేళ నగరంలో ఉన్న ముగ్గురు కూటమి ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి (బీజేపీ) కానీ, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ (టీడీపీ) కానీ, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (టీడీపీ) కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లు అయింది. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అంతా తానై నడిపించాల్సి వచ్చింది. మేయర్ ఎన్నికల్లో మేయర్ సీటును తమ వారసులకు, అనుచరులకు ఆశించిన నగర ఎమ్మెల్యేలు .. అది కాస్తా పొత్తులో భాగంగా జనసేనలోకి వెళ్లిన వంగవీటి రాధాకు వెళ్లిపోవడం, ఆయన గెలవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో తన కుమారుడికి మేయర్ పదవి దక్కలేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అసంతృప్తిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ మేయర్ పదవి విషయంలో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవిని తమ వారికి ఆశించిన వీరిద్దరూ.. కేశినేని చిన్ని ఎంపిక చేసిన చెన్నుపాటి కాంతిశ్రీ విషయంలో అసహనంగా ఉన్నట్లు సమాచారం. అందుకే వీరంతా కీలకమైన మేయర్ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ కేశినేని చిన్ని మాత్రం.. విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని, నగర అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుండి అనుబంధం, కష్టకాలంలోనూ పార్టీ కోసం పోరాడిన కుటుంబానికి డిప్యూటీ మేయర్ పదవి ద్వారా సముచిత గౌరవం కల్పించినట్లు చెప్పుకొచ్చారు.














Click it and Unblock the Notifications
