నాగార్జునసాగర్ జలాల పంపిణీపై ఏపీ వర్సెస్ తెలంగాణా..త్రిసభ్య కమిటీ భేటీలో జరిగిందిదే!
నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను బలంగా వినిపించారు. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు సాగినప్పటికీ, కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపుల అంశంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండా ముగిసింది.
బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు తమ అవసరాల కోసం మొత్తం 21 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించింది. ఇందులో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద 6 టీఎంసీలు అవసరమని స్పష్టం చేసింది.

మరోవైపు సాగర్ కుడి, ఎడమ కాలువల కింద 9 టీఎంసీలు, కృష్ణా డెల్టా వ్యవస్థకు 10 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. సాగర్‌లో ప్రస్తుతం ఉన్న జలాల ఆవిరి నష్టాలు పోను జూలై 2027 వరకు సుమారు 40 టీఎంసీల మేర ఉపయోగించుకునే అవకాశం ఉందని, తమకు నాగార్జునసాగర్ ఒక్కటే ప్రధాన ఆధారమని తెలంగాణ అధికారులు వివరించారు. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నిల్వల నుంచి నీళ్లు విడుదల చేసే ప్రసక్తే లేదని తెలంగాణ ఇంజినీర్లు తేల్చి చెప్పారు.
ట్రైబ్యునల్ నిబంధనల ప్రకారం నదిలో ప్రవాహాలు ఉన్నప్పుడే డెల్టాకు నీటిని అందించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఏపీలోని పులిచింతల, ప్రకాశం బ్యారేజీల్లోనే సుమారు 26 టీఎంసీల నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే కనీస నీటి మట్టం 510 అడుగుల దిగువన నీటిని తోడేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. మరోవైపు 510 నుంచి 490 అడుగుల మధ్య ఉండే మరో 31 టీఎంసీల నీటిని కూడా పంచాలని, డెల్టా హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్ పనులపైనా ఇరు రాష్ట్రాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ఏ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టారని తెలంగాణ ప్రశ్నించగా, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జల్‌జీవన్ మిషన్ కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఏపీ అధికారులు బదులిచ్చారు. తాగునీటి, సాగునీటి అవసరాల మధ్య సమతుల్యత సాధించాల్సిన తరుణంలో, కృష్ణా డెల్టాకు నీటి విడుదల అంశంపై త్వరలోనే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు.












Click it and Unblock the Notifications
